లక్ష్మీదేవికి నైవేద్యం : దివాళీకి ఇంట్లో చేసుకునే స్వీట్స్ ఇవే

  • Publish Date - October 25, 2019 / 05:45 AM IST

దీపావళి అంటే పిల్లలకే కాదు.. పెద్దలకు ఇష్టమైన పండుగ. ఇల్లంతా దీపాల వెలుగులు. లక్ష్మీ దేవిని పూజిస్తాం. మరి ఆ తల్లికి నైవేద్యం పెట్టాలి కదా.. బయటకు కొనుక్కొని వచ్చే వాటి కంటే.. ఇంట్లో నిష్ఠగా, ఇష్టంగా లక్ష్మీదేవికి తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టటం ఆనవాయితీగా వస్తోంది. ఇంట్లో ఈజీగా తయారు చేసుకుని.. లక్ష్మీదేవికి సమర్పించే తీపి పదార్థాలు, వాటి తయారీ విధానం ఎలాగో తెలుసుకుందామా..

బాద్ షా : అందరికీ ఇష్టమే కదా.. 
కావాల్సిన పదార్ధాలు :
మైదా అరకిలో. డాల్డా 200 గ్రాములు. బేకింగ్ సోడా అర టీస్పూన్, చక్కర కిలో, యాలకుల పొడి టీస్పూన్, నెయ్యి 10 గ్రాములు, అర లీటరు వాటర్, కావాల్సినంత ఆయిల్.

తయారీ విధానం ఇలా :

ఒక్క గిన్నెలో మైదా పిండి, బేకింగ్ సోడా, డాల్డా తీసుకుని సరిపోయినంత నీళ్ళు పోసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను గుండ్రంగా చేసి మధ్యలో చిన్న రంధ్రం పెట్టుకోవాలి. అంతకంటే ముందుగానే వేడి చేసిన నూనెలో వాటిని వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి ఉంచుకోవాలి.
పంచదార పాకం తయారీ :
ఒక్క గిన్నె లో పంచదార, నీళ్ళు తీసుకుని సన్నని సెగపై తీగ పాకం వచ్చే వరకు మరిగించాలి. ఈ పాకంలో సువాసనతోపాటు ఆరోగ్యం ఇచ్చే యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న బాద్ షా ఆ పాకంలో వేసి 10 నిమిషాలు ఉంచి తీసేయాలి. అంతే బాదు షా రెడీ. టేస్టీ టేస్టీ బాద్ షా అంటే ఎవరికి నోరూరదు చెప్పండి.

………………………

కోవా కజ్జి కాయలు : టేస్టీ స్వీట్ 
కావాల్సిన పదార్థాలు : 
మైదాపిండి అర కిలో, పంచదార కిలో, పాలకోవా పావుకిలో, జాపత్రి 2 గ్రాములు, యాలకుల పొడి, శనగపిండి 50 గ్రాములు, వంట సోడా పావు స్పూను, బేకింగ్ పౌడర్ పావు స్పూను, నెయ్యి 100 గ్రాములు, ఆయిల్ డీఫ్రై కి సరిపడినంత తీసుకోవాలి.
తయారీ విధానం : 
కడాయిలో శనగపిండి, కోవా కలిపి వేయించి దించాలి. అందులో జాపత్రి, యాలకుల పొడి చేసుకోవాలి. ఇందులో కొంచెం పంచదార కలిపి ముద్దగా చేయాలి. కడాయిలో మిగిలిన పంచదార వేసుకోవాలి. 2 గ్లాసులు నీళ్ళు పోయాలి. లేత పాకం తీసుకోవాలి. మైదాపిండిలో వంట సోడా, బేకింగ్ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇందులో నెయ్యి, నీళ్ళు పోసి చిన్న ముద్దలుగా చేయాలి. వీటిని పూరీలాగా అత్తుకోవాలి. కొంచెం మందంగా చేసుకుని.. మధ్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి అర్ధ చంద్రాకారంలో మూయాలి. అంచులను తడిచేసి, కోవాకు దగ్గరగా చుట్టి కజ్జికాయలుగా చేయాలి. వీటిని నూనెలో వేయించి బంగారు రంగు రాగానే తీసి, పంచదార పాకంలో వేసి తీసేయాలి.

…………………….

రవ్వ లడ్డు : దివాళీకి ఉండాల్సిందే :
కావాల్సిన పదార్ధాలు : ఉప్మా రవ్వ పావుకిలో, చక్కెర పావుకిలో, కొబ్బరి పొడి అరకప్పు, జీడిపప్పు, యాలకుల పొడి అరటేబుల్ స్పూన్, వెన్న(నెయ్యి) 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం :
ఓ గిన్నె తీసుకుని టేబుల్ స్పూన్ నెయ్యిలో జీడిపప్పు వేయించుకోవాలి. అదే విధంగా ఉప్మా రవ్వను కూడా వేయించుకుని సిద్ధం చేసుకోవాలి. ఇందులో కొబ్బరిపొడి వేసి కలపాలి. మరో కడాయి తీసుకుని చక్కెర, అరకప్పు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి తీగ పాకం వచ్చే వరకు మరిగించాలి. ఇందులో యాలకుల పొడి, రవ్వ, జీడిపప్పు మిశ్రమాలను కలపాలి. ఇది చల్లారిన తర్వాత వేడిగా ఉన్న నెయ్యి చేతికి రాసుకుని ఉండలు చేసుకోవాలి. రవ్వ లడ్డూలు రెడీ. పిల్లలకు పెడితే ఎంతో బలం కూడా.