Mahashivaratri 2022 : రేపే మహాశివరాత్రి…లింగోద్భవ సమయం ఎప్పుడంటే..!

లింగోద్భవ సమయం 01-03-2022 మంగళవారం రాత్రి తెల్లవారితే బుధ వారం రాత్రి 12 గంటల 29 నిమిషాల 4 సెకెండ్ల నుండి 12 గంటల 31 నిమిషాల 59 సెకెండ్ల పాటు లింగోద్భవ కాలం.ఈ సమయంలో భక్తులు పరమేశ్

MahashivaRatri 2022

Mahashivaratri 2022 : మహాశిరాత్రి పర్వదినాన్ని భక్తులు రేపు అత్యంత భక్తి శ్రధ్ధలతో జరుపుకోనున్నారు.  శివలింగానికి కాసింత పూజను, అభిషేకాన్ని ఏ రోజు చేసినా పుణ్యఫలమే. అందులోనూ శివరాత్రి వేళ లింగోద్భవ సమయంగా చెప్పే సమయంలో ఇక అలాంటి పూజలు, అభిషేకాలు చేస్తే ఎంత గొప్ప పుణ్యఫలం ప్రాప్తిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమేముంటుందని పురాణజ్ఞులు, పండితులు అంతా అనేమాట వాస్తవమే.

రేపు మహాశివరాత్రి సందర్భంగా లింగోధ్బవ సమయాన్ని జ్యోతిష పండితులు తెలిపారు. లింగోద్భవ సమయం 01-03-2022 మంగళవారం రాత్రి తెల్లవారితే బుధ వారం రాత్రి 12 గంటల 29 నిమిషాల 4 సెకెండ్ల నుండి 12 గంటల 31 నిమిషాల 59 సెకెండ్ల పాటు లింగోద్భవ కాలం.ఈ సమయంలో భక్తులు పరమేశ్వరుని అర్చించి స్వామి వారికృపకు పాత్రులు కాగలరు.

శివరాత్రి ఉత్సవాల సందర్భంగా  ప్రముఖ  శైవ క్షేత్రాలన్నీ శివ నామ స్మరణతో మారుమోగిపోతున్నాయి.  శివారాధనలో లింగరూపంలో పూజిస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి.

మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు , పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది.

ఈ పర్వదినాన లింగాష్టకం , శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి , భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో , చింతనలో గడిపి , రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం. ఇప్పిటికే ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

సర్వేశ్వరుడైన ఈశుడు లింగస్వరూపుడూ అందులోనూ తేజో లింగస్వరూపుడై అవతరించిన మరుక్షణంలోనే మానవాళికి గొప్ప సందేశాన్ని ఇచ్చాడని వివరించే ఒక కథా సందర్భం శివపురాణంతో పాటు ఇతర పురాణాలలో కూడా ప్రస్తావితమై ఉంది.

శివపురాణంలోని లింగోద్భవ కధ 

ఓసారి బ్రహ్మకు, విష్ణువుకు తాను గొప్పంటే తాను గొప్పన్న అహంకారం కలిగింది. అది కాస్త తీవ్ర రూపం దాల్చి యుద్ధ స్థాయికి చేరింది. లోకాలన్నీ ఆ తగవులాటవల్ల భీతిల్లుతున్న తరుణంలో చంద్ర శేఖరుడు హరిబ్రహ్మలకు జ్ఞానాన్ని ప్రసాదించాలనుకున్నాడు. వెంటనే వారి ముందు ఒక దివ్యతేజోరాశిని ఆద్యంతాలు తెలియని స్తంభలింగరూపంలో అవతరించేలా చేశాడు.

అప్పటిదాకా అక్కడ లేని ఆ దివ్యతేజోస్తంభం ఏమిటా అని హరి, బ్రహ్మలు యుద్ధంమాని విస్తుపోతూ చూశారు. వెంటనే పార్వతీ వల్లభుడు తన దివ్యలీలా విలాసంతో వారికి ఓ పరీక్ష పెడుతున్నానని, ఆ స్తంభం (లింగం) అగ్రభాగాన్ని ఒకరు, అడుగు భాగాన్ని మురొకరు చూసి రావాలని, ఎవరు ముందుగా వస్తే వారే గొప్పని, వారికే సర్వాధిపత్యం అని చెప్పాడు. వెంటనే బ్రహ్మ హంసరూపుడై ఆ తేజోలింగం అగ్రభాగానికి చేరటానికి వెళ్ళాడు. విష్ణువు వరాహరూపుడై ఆ లింగం మూలం ఎక్కడుందో తెలుసుకోవటానికి పాతాళం వైపు ప్రయాణం చేశాడు.

హరి, బ్రహ్మలకు ఆ దివ్యతేజో రాశి ఆద్యంతాలు ఎంతకీ అంతు పట్టలేదు. ఇంతలో పై నుండి ఒక కౌతకి (మొగలిపువ్వు) రావటం హంస రూపంలో ఉన్న బ్రహ్మ చూశాడు. బ్రహ్మ మొగలి పువ్వును ప్రలోభపెట్టి తాను ముందుగా తేజో రాశి అగ్రభాగాన్ని చూశానని చెప్పుకోవటానికి సాక్ష్యంగా ఉండమని కోరాడు. పాతాళం వైపు వెళ్ళిన విష్ణువుకు తేజోరాశి పీఠభాగం ఎంత దూరం వెళ్ళినా కనిపించలేదు.

ఇంతలో అబద్ధపు సాక్ష్యం చెప్పేందుకు మొగలి పువ్వును వెంట పెట్టుకొని శివుడి దగ్గరకొచ్చాడు బ్రహ్మ. ఆ తర్వాత కొద్ది సేపటికి విష్ణువు తేజోలింగం అడుగు భాగం తాను కనుక్కోలేకపోయానని బాధపడుతూ పై కొచ్చాడు. శివుడికి బ్రహ్మ తేజోరాశి అగ్రభాగాన్ని తాను చూశానని అందుకు సాక్ష్యంగా కేతకిని కూడా వెంటపెట్టుకొచ్చానన్నాడు. ఆ అసత్య మాటలకు శివుడికి కోపం ముంచుకువచ్చిది. వెంటనే భైరవుడిని సృష్టించి అసత్యమాడినందుకు బ్రహ్మను దండించమన్నాడు.

భైరవుడు అప్పటిదాకా బ్రహ్మకున్న ఐదుతలలలో అబద్ధం ఆడిన తలను తుంచేశాడు. తరువాత తప్పును తెలుసుకున్న బ్రహ్మ ఈశుడిని శరణు వేడుకొన్నాడు. పక్కనే ఉన్న విష్ణువు కూడా అప్పటికే శివుడి గొప్పప్పతనాన్ని గ్రహించి శివుడికి నమస్కరించాడు. బ్రహ్మ తప్పును క్షమించమని కూడా వేడుకున్నాడు. శరణాగత వత్సలుడైన శంకరుడు చల్లబడ్డాడు. ఇంతకు ముందు లాగానే బ్రహ్మకు సృష్టి అధికారం ఉంటుందని, అయితే ఇతర దేవతల్లాగా బ్రహ్మకు ఆలయాలు, పూజలు ఏవీ ఉండవని చెప్పాడు. అబద్ధం ఆడకుండా వాస్తవాన్ని తెలిపిన విష్ణువు అందరి చేత పూజలందుకుంటాడని, స్థితి కారకుడిగా వెలుగొందుతాడని అన్నాడు.

మొగలిపువ్వును చూసి అసత్యమాడిన పాపానికి తన పూజలో మొగలిపువ్వుకు చోటుండదని అన్నాడు. అయితే ఆ కేతకి శివుడికి పరిపరివిధాల ప్రణమిల్లింది. భక్తవత్సలుడైన శివుడు అప్పుడు కొంత శాంతించి శివపూజకు పనికి రాకపోయినా శివభక్తులు మాత్రం మొగలిపువ్వును ధరిస్తారని, అలా జన్మను చరితార్థం చేసుకోమని చెప్పి అంతర్థానమయ్యాడు. ఈ కథా సందర్భంలో ఎంతటి వారైనా అసత్యమాడితే పాపఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని తెలియజెప్పే సందేశం ఇమిడి ఉంది. మానవులాంతా సత్యమార్గంలోనే నడుచుకోవాలన్న ఈశ్వర సందేశం ఇక్కడ కనిపిస్తోంది.

శివలింగోద్భవం గురించి స్కంద పురాణంలో 

ఒక మహా ప్రళయానంతరం బ్రహ్మ, విష్ణువుల మధ్య అహంకారం తలెత్తి అది చివరకు ఎంతవరకు వెళ్ళిందంటే ఎవరు గొప్పో తేల్చుకొనేంత దాకా వచ్చి యుద్ధానికి దారి తీసింది. ఇరువురు ఒకరిపై ఒకరు పాసుపతాస్త్రాలను ప్రయోగించుకొన్నారు.  దీనిని గమనించిన పరమేశ్వరుడు మరో మారు ప్రళయం జరుగకుండా రెండు అస్త్రాల మధ్య కోటి సూర్యకాంతితో ఆది మధ్యాంతరాలు తెలియరాని విధంగా ఒక మహాగ్నిస్తంభాన్ని ఆవిర్భవింపజేసి అందులో అందరికి దివ్య దర్శనం ఇచ్చాడు.

పుష్కలంగా మేఘాలను రప్పించి జలాన్ని వర్షింపజేసి మహాగ్నిస్తంభాన్నిచల్లార్చాడు అదే శివలింగం. మాఘ బహుళ చతుర్దశినాడు అర్ధరాత్రి సమయంలో ఇది జరిగింది. కాబట్టి దీనినే లింగోద్భవ కాలం అంటారు.  ఈ లింగం యొక్క ఆది అంతాలను తెలుసుకొనేందుకు విష్ణుమూర్తి వరాహ రూపంలో బయలు దెరుతాడు.  జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని,  బ్రహ్మదేవుడు హంస రూపం దాల్చి ఆది భాగాన్ని తెలుసుకొనేందుకు వెళ్లి దానిని కనుగొనలేక చివరకు పరమేశ్వరుడ్నే శరణు వేడుకొంటారు.  అప్పుడు పరమశివుడు తన నిజరూపంతో దర్శనమిచ్చి వారి అహంకారాన్ని పోగొట్టాడు.

శివరాత్రి నాడు ఈ లింగోధ్బవ కాలం ముఖ్యమైనది. కావున అన్ని శివాలయాలలో ఆ రోజు రాత్రి  పంచాంగం కర్తలు తెలిపిన  లింగోద్భవ కాలానికి స్వామికి అభిషేకాలు  ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో లింగం దర్శనం, స్వామి వారికి చేసే అభిషేకాల దర్శనం చేసుకుంటే మహా పుణ్యఫలం సిద్ధిస్తుంది.ఈ సమయంలో స్వామి వారిని బిల్వ పత్రాలతో పూజించి, పంచామృతాలతో అభిషేకిస్తే సంవత్సర కాలం నిత్య శివారాధన ఫలితం దక్కుతుందని అంటారు…స్వస్తి.