Kamada Ekadashi 2026 : కోరిన కోర్కెలు తీర్చే కామద ఏకాదశి.. ఈ పండ్లను ప్రసాదంగా పెడితే.. ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయి..!
Kamada Ekadashi 2026 : శ్రీరామనవమి తర్వాత వచ్చే కామద ఏకాదశి నాడు ఈ విధంగా పూజ చేస్తే కోరిన కోర్కెలు అన్ని తీరతాయంటున్నారు పండితులు
- Dharani Pilli
- Published On : March 22, 2026 / 08:53 PM IST
kamada ekadashi 2026 know date time puja vidhanam and significance
Kamada Ekadashi 2026 : హిందూ పురాణాల్లో ఏకాదశి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది. పవిత్రమైన తిథిగా భావిస్తారు. చాలామంది ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు. అయితే ప్రతి నెలా కృష్ణ, శుక్ల పక్షాల్లో రెండు ఏకాదశి తిథులు వస్తాయి. అయితే చాలా వరకు ఈ ఏకాదశి తిథులకు ఏదో ఒక విశిష్టత ఉంటుంది. అలానే చైత్ర మాసంలో వచ్చే అనగా ఉగాది పండగ తర్వాత వచ్చే తొలి ఏకాదశికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. చైత్ర మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని కామద ఏకాదశి అంటారు. మత విశ్వాసాల ప్రకారం, కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, సరైన పద్ధతుల్లో విష్ణుమూర్తిని పూజిస్తే.. జీవితంలో కోరుకున్న కోర్కెలు నెరవేరతాయని.. అలానే అన్ని దుఃఖాలు, బాధలు తొలగిపోయి, సుఖసంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. మరి ఈ సంవత్సరం కామద ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఆ రోజు పూజ చేయడానికి శుభ సమయం, విధానం, ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకుందాం.
దృక్ పంచాంగం ప్రకారం, 2026లో మార్చి 29, ఆదివారం నాడు వచ్చింది.
- ఏకాదశి తిథి ప్రారంభం: మార్చి 28, 2026 ఉదయం 8:49 గంటలకు
- ఏకాదశి తిథి ముగింపు: మార్చి 29, 2026 ఉదయం 7:48 గంటలకు
- పారణ (ఉపవాస విరమణ): మార్చి 30, 2026 ఉదయం 6:20 నుండి 7:12 మధ్య
పూజా సమయం:
కామద ఏకాదశి నాడు పూజకు శుభ సమయం మార్చి 29 ఉదయం 7:48 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:26 గంటల వరకు కొనసాగుతుంది.
కామద అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. ఇందులో “కామ” అంటే కోరికలు, “ద” అంటే ఇవ్వడం. మొత్తం కలిపి చూస్తే, కోరికలను నెరవేర్చేవాడని అర్థం. అయితే ఇది కేవలం భౌతిక కోరికలను మాత్రమే సూచించదు, ఆధ్యాత్మిక లక్ష్యాల సాధనకు దారి చూపుతుంది. కామద ఏకాదశి నాడు నిజాయితీగా, భక్తితో ఆచరించే వారు కర్మ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందుతూ అంతరంగ శాంతి వైపు ముందుకు సాగగలరు. ఈ రోజున భక్తితో ఉపవాసం పాటించడం వల్ల చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండడం ద్వారా మనసు ప్రశాంతంగా మారుతుంది, భౌతిక ఆకాంక్షలు తగ్గుతాయి. తద్వారా శాస్త్ర పఠనం, జపం వంటి భక్తి కార్యక్రమాలలో సులభంగా దృష్టి కేంద్రీకరించవచ్చు.
పూజా విధానం:
- కామద ఏకాదశి రోజున తెల్లవారుజామునే లేచి తల స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి.
- ఆ తర్వాత విష్ణుమూర్తిని ధ్యానించుకుని.. ఉపవాసం పాటిస్తానని సంకల్పం తీసుకోవాలి.
- అనంతరం ఒక పీట మీద పసుపు రంగు వస్త్రాన్ని పరిచి, దాని మీద విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి.
- ఆ తర్వాత పంచామృతంతో స్వామికి అభిషేకం చేసి.. వస్త్రాలు, చందనం, యజ్ఞోపవీతం, బియ్యం, నువ్వులు, అగరబత్తీలు, సుగంధ ద్రవ్యాలు, నైవేద్యం, పువ్వులు, దీపాలు, నైవేద్యం, ఆయా కాలాల్లో లభించే పండ్లు, కొబ్బరి కాయలు, తమలపాకులు మొదలైనవాటిని సమర్పించండి.
- ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ మంత్రాన్ని జపించాలి.
- ఆ తర్వాత, కామద ఏకాదశి కథను వినడం లేదా చదవడం చేయాలి.
- చివరకు హారతి ఇచ్చి పూజ ముగించాలి.
కామద ఏకాదశి రోజున శ్రీ హరికి అరటిపండ్లను నైవేద్యంగా సమర్పిస్తే.. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు జాతకంలో గురు దోషం కూడా తొలగిపోతుందంటారు. అదే విధంగా పసుపు రంగులో ఉండే వస్తువులతో పాటు ఖీర్‌ను కూడా విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించడం వల్ల శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. 10tv దీన్ని ధ్రువీకరించడం లేదు.
