వన భోజనాలు.. విశిష్టత

  • Published By: chvmurthy ,Published On : November 3, 2019 / 06:09 AM IST
వన భోజనాలు.. విశిష్టత

కార్తీక మాసం వచ్చిందంటే చాలు వన భోజనాలు గుర్తుకు వస్తాయి. చిన్నా, పెద్దా, అని వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ  సరదాగా ఆట, పాటలతో, భక్తి భావంతో పూజలు చేస్తూ ఉసిరి చెట్టునీడన భోజనం చేస్తుంటారు. ఆనందం, ఆహ్లాదకరంగా సాగే వనభోజనాలు మన సంప్రదాయాలను చాటిచెబుతాయి. బంధువులు, స్నేహితులతో కలిసి చెట్ల నీడలో భోజనం చేయటాన్ని వన భోజనం అంటారు. అసలు కార్తీక మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో ఒక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటుంది. ఏడాది కాలంలో ఎప్పుడు కుదిరినా కుదరక పోయినాబంధు మిత్రులతో కలిసి సమయం గడింపేందుకు వనభోజనాలు గొప్పసందర్భంగా మారింది. పురాణ కధల ప్రకారం చెప్పాలంటే కార్తీక పురాణంలో వనభోజనాల ప్రసక్తి ప్రముఖంగా కనిపిస్తుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఉన్న వనంలో, విష్ణుమూర్తిని అర్చించి వనభోజనం చేసినవారి సకల పాపాలూ తొలగిపోతాయన్నది పురాణంలోని మాట. ఈ సంప్రదాయాన్ని తరచి చూస్తే వనభోజనానికి ఎందుకంత ప్రాధాన్యతో అర్థమవుతుంది.

ఇప్పుడు స్పీడ్ యుగం అయిపోయి వనభోజనాలు ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నారు కానీ, కార్తీకమాసం.. వన భోజనం అంటే ఎక్కడ పడితే అక్కడ చేసే కార్యక్రమం కాదు. వన భోజనానికి ఎంచుకునే ప్రదేశం అత్యంత పవిత్రంగా ఉండాలి. వన భోజనాలకు రకరకాల ఫల, పుష్ప, వృక్షాలు కలిగిన ఏటి ఒడ్డున ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకోవడం ఉత్తమం. అక్కడ తప్పనిసరిగా ఉసిరి చెట్టు ఉండాలి. తులసివంటి మొక్కలు కూడా ఉంటే మరీ మంచిది. బయట నుండి తెచ్చినవి కాకుండా ఆహార పదార్థాలు అక్కడే వండుకోవాలి. సాత్విక ఆహారాన్ని తీసుకోవడం మేలు. ఉసిరి చెట్టు కింద సాలగ్రామం పెట్టి కార్తీక పూజలు చేయాలి. తరువాత విస్తరాకులలో గానీ అరిటాకుల్లో గాని అందరూ కలసి భోజనం చేయాలి. ఇలా అందరూ కలసి పని చేయడంలో సహకార స్ఫూర్తి మనకు కనపడుతుంది. స్నేహాన్ని, సమైక్యతను పెంచేదే ఈ వనభోజనాల సంప్రదాయం. 
 
వన భోజనాల్లో ఉసిరి చెట్టు నీడన భోజనం చేయడంలో మన ఆరోగ్య రహస్యం దాగి ఉంది. ఉసిరి చెట్టు నుండి వీచే గాలి కారణంగా మన దేహంలో ఉన్న అనేక రుగ్మతలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మన ఆహారంలో ఉసిరిని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వలన మనం మరింత ఆరోగ్యవంతులుగా తయారవుతాము. చిన్న ఉసిరికాయ తినడం ద్వారా మన శరీరం మరింత కాంతివంతంగా తయారవుతుంది. వానా కాలం ముగిసి శీతాకాలం ప్రారంభం అయ్యే మాసం కార్తీక మాసం శ్వాసకోస వ్యాధులు, జ్వరాలు ప్రజలను ఇబ్బంది పెడుతుంటాయి. వనభోజనం కారణంగా వివిధ రకాల ఆయుర్వేద మొక్కలు, వృక్షాల నుండి వచ్చే గాలి అందరికి దివ్య ఔషధంగా పనిచేస్తోంది. వన భోజనాలు చేయడంవలన మన ఆరోగ్యం మాత్రమే కాదు, మనం మన ప్రకృతిని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. పర్యావరణ పరిరక్షణ అనే భావన ఈ వనభోజనాలలో అంతర్లీనంగా ఉంది. ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుందనే సందేశం ఈ వనభోజనాలలో దాగి ఉంది. కేవలం మొక్కలు నాటడమే కాదు నాటిన వాటిని చక్కగా కాపాడుకోవాలి అనే స్పృహ ప్రతి ఒక్కరిలోనూ ఈ కార్తీక మాస వన భోజనాల ద్వారా మనకు కలుగుతుంది. వన భోజనాలు వంటి కార్యక్రమాలలో పాల్గొనడం వలన నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. సమిష్టి బాధ్యత అలవడుతుంది. మిత్రుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. భావ వ్యక్తీకరణ నైపుణ్యం పెరుగుతుంది. 

కార్తీక వనభోజనాలకు వెళ్లేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అందరికీ మంచిది. కార్తీక విహారయాత్రలు విషాద యాత్రలుగా మారకుండా ఉండటం అనేది మన చేతుల్లోనే ఉంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సంతోషంగా వెళ్ళి రావచ్చును. వెళ్ళబోయే ప్రదేశాన్ని గురించి ముందుగానే తెలుసుకొని ఉండటం మంచిది. ముఖ్యంగా నదిలో, సముద్రంలో స్నానం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలను, వయసు మళ్ళిన వారిని ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి. ప్రాథమిక చికిత్సకు సంబంధించిన వస్తువులను దగ్గర ఉంచుకోవాలి. దగ్గరలో ఉన్న పోలీసుస్టేషన్, హాస్పిటల్స్‌కు సంబంధించిన వివరాలు దగ్గర పెట్టుకోవాలి. ఇవన్నీ పాటిస్తే విహారయాత్ర మర్చిపోలేని మధురానుభూతిగా మన మనసుల్లో మిగిలిపోతుంది.