Lakshmi Panchami 2026 : మార్చి 23: లక్ష్మీ పంచమి+కృతిక నక్షత్రం.. 5 వత్తులతో దీపం పెట్టి ఇలా పూజ చేస్తే.. బంగారం కొంటూనే ఉంటారు..!
Lakshmi Panchami 2026 : మార్చి 23 లక్ష్మీ పంచమి నాడు ఈ విధంగా పూజిస్తే.. బంగారం ధర ఎంత పెరిగినా కొనుగోలు చేస్తూనే ఉంటారని చెబుతున్నారు పండితులు.
- Dharani Pilli
- Published On : March 22, 2026 / 09:52 PM IST
Lakshmi Panchami 2026 Puja Timing significance dos and don'ts
Lakshmi Panchami 2026 : హిందూ పురాణాల్లో నాలుగు నవరాత్రుల గురించి వర్ణించారు. కానీ ఎక్కువ మంది మాత్రం దసరా సమయంలో, అలానే ఉగాది నాటి నుంచి ప్రారంభం అయ్యే చైత్ర నవరాత్రులనే పాటిస్తారు. ఈ నవరాత్రి 9 రోజులు అమ్మవారిని 9 రూపాల్లో కొలుస్తారు. ఈ క్రమంలో చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులలో ఐదవ రోజును **’లక్ష్మీ పంచమి’**గా జరుపుకుంటారు.
ఈ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చేసే పూజలు ఆర్థిక ఇబ్బందులను తొలగించి, సుఖసంతోషాలను ప్రసాదిస్తాయంటున్నారు పండితులు. ఈసారి లక్ష్మీ పంచమి మార్చి 23, 2026 సోమవారం, కృత్తికా నక్షత్రం నాడు రావడం మరింత విశేషం అంటున్నారు పండితులు.
పూజా సమయం- విధి విధానాలు:
తేదీ: మార్చి 23, 2026 (సోమవారం) పూజ చేసుకోవాలి.
దీపారాధన: ఆవు నెయ్యితో ఐదు లేదా ఆరు వత్తులు వేసి దీపారాధన చేయాలి. ఐదు వత్తులు బుద్ధి, విద్య కోసం అయితే ఆరు వత్తులు ధన, ధాన్య మరియు సౌభాగ్యం కోసం పెడతారు.
అభిషేకం: లక్ష్మీ పంచమి నాడు ఇంట్లో ఉన్న వెండి, బంగారు ఆభరణాలను శుభ్రం చేసి, వాటికి పంచామృతం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయాలి.
పారాయణం: కనకధారా స్తోత్రం, అష్టలక్ష్మీ స్తోత్రం, శ్రీ సూక్తం లేదా లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించాలి. సంతానం కోరుకునే వారు ‘సంతాన లక్ష్మీ స్తోత్రాన్ని’ 11 సార్లు చదవాలని పండితులు చెబుతున్నారు.
సాయంత్రం పూజ: మార్చి 23 సోమవారం సాయంత్రం 6:15 నుండి 7:15 గంటల మధ్య కనకధారా స్తోత్రాన్ని 11 సార్లు పఠించి కుంకుమ ధరిస్తే విశేష ఫలితాలు ఉంటాయంటున్నారు పండితులు.
విశేష పరిహారాలు – సూచనలు:
- 108 దీపాలు: లక్ష్మీ పంచమి నాడు వీలైతే 108 ప్రమిదలలో ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి ‘శ్రీ’ ఆకారం లేదా ‘తామర పువ్వు’ ఆకారంలో అమర్చి పూజిస్తే.. అమ్మ అనుగ్రహం లభిస్తుందంటున్నారు.
- బంగారం/వెండి కొనుగోలు: ఈ రోజున లక్ష్మీ పంచమి కాబట్టి కొత్త ఆభరణాలు కొంటే కలిసి వస్తుందంటున్నారు. నేటి పరిస్థితుల్లో బంగారం కొనలేం కాబట్టి.. ఇంట్లో ఉన్న పాత నాణేలు లేదా ఆభరణాలతో పూజ చేసినా సరిపోతుందంటున్నారు.
- స్త్రీలను గౌరవించాలి: స్త్రీలను లక్ష్మీ స్వరూపంగా భావించి గౌరవించాలి. ఐదుగురు ముత్తైదువులకు బొట్టు పెట్టి తాంబూలం ఇస్తే మంచిదని సూచిస్తున్నారు.
- గజలక్ష్మి పూజ: ఏనుగుల (గజములు) బొమ్మల మధ్య లక్ష్మీదేవిని ఉంచి పూజిస్తే ఐశ్వర్యం స్థిరంగా ఉంటుందంటున్నారు పండితులు. గుడ్లగూబ వంటి పక్షుల బొమ్మలను పూజించవద్దని సూచిస్తున్నారు.
నైవేద్యం, దానం:
- పాలతో చేసిన పదార్థాలు (క్షీరాన్నం/చక్కెర పొంగలి) లేదా దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తే మంచిది అంటున్నారు.
- గోరువెచ్చని పాలను నివేదించి ఐదుగురికి పంపిణీ చేసినా.. ఆవుకు వస్త్రం దానం చేసినా మంచి ఫలితాలు వస్తాయంటున్నారు.
