Lakshmi Panchami 2026 : లక్ష్మీ పంచమి.. నేడు ఇలా పూజిస్తే.. అప్పులు తీరడమే కాక ధనలాభం, వ్యాపారంలో వృద్ధి.. వాస్తు సమస్యలు పరిష్కారం..!
Lakshmi Panchami 2026 : లక్ష్మీ పంచమి నాడు కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటిస్తే.. అప్పుల ఊబి నుంచి బయటపడతారని పండితులు చెబుతున్నారు.
- Dharani Pilli
- Published On : March 23, 2026 / 07:14 AM IST
lakshmi-panchami 2026 rituals and benefits for prosperity and wealth full details here
Lakshmi Panchami 2026 : చైత్ర నవరాత్రుల్లో భాగంగా నేడు లక్ష్మీ పంచమి. అయితే ఈ లక్ష్మీ పంచమికి ప్రత్యేక విశిష్టత ఉంది. సోమవారం నాడు కృత్తిక నక్షత్రంలో ఈ లక్ష్మీ పంచమి రావడం వల్ల విశేషమైన లాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున లక్ష్మీ దేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే.. ఆర్థిక సమస్యలు తొలగిపోయి.. ధనధాన్యవృద్ధి కలుగుతుందని చెబుతున్నారు. అలానే పలు సమస్యల నివారణ కోసం ప్రత్యేక పద్ధతుల్లో పూజిస్తే.. పరిష్కారం లభిస్తుందంటున్నారు పండితులు. అలానే ఈ రోజు కొన్ని పనులు అసలు చేయకూడదని.. కొన్ని పనులు తలపెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుందని చెబుతున్నారు.
పాటించాల్సిన నియమాలు
- లక్ష్మీ పంచమి రోజున తెల్లవారుజామునే లేచి.. ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి.
- ఇంటి గుమ్మాన్ని కడిగి పసుపు రాసి.. కుంకుమ బొట్లు పెట్టి.. ముగ్గులు వేయాలి.
- ఇంటి గుమ్మం పరిశుభ్రంగా ఉంటే లక్ష్మీ దేవి ఆ నివాసంలోకి వస్తుందని నమ్ముతారు. అందుకే గుమ్మాన్ని అందంగా అలంకరించాలి.
పూజా విధానం..
- లక్ష్మీ పంచమి నాడు పూజ కోసం.. లక్ష్మీదేవి చిత్రపటం, రాగి కలశం, అక్షింతలు, కొబ్బరికాయ, పండ్లు, పూలు వంటి వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకోవాలి.
- ఈ రోజున కొత్తగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని కొని తెచ్చుకోవడం శుభప్రదం.
- పూజ గదిలో లేదంటే పూజ చేయాలని భావించే చోట ఒక చెక్క పీట వేసి దాని మీద ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆపై లక్ష్మీదేవి ఫోటోని ఉంచి, గులాబీ పూలతో అలంకరించాలి.
- రాగి లేదా ఇత్తడి కలశంలో నీళ్లు పోసి, పసుపు కుంకుమలు వేసి, పైన కొబ్బరికాయను ఉంచాలి.
- ముందుగా గణపతిని పూజించాలి.
- ఆ తర్వాత లక్ష్మీ దేవి కోసం.. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఆవు నెయ్యితో వెలిగించిన 2 దీపాల సమక్షంలో లక్ష్మీదేవికి అక్షింతలు, పుష్పాలు సమర్పించాలి.
- నైవేద్యంగా పాలు పొంగించి చేసిన పరమాన్నం నివేదించడం వల్ల కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి.
ప్రత్యేక పరిహారాలు:
- అప్పుల నుండి విముక్తి: అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు.. రుణ బాధ నుంచి విమోచన పొందాలంటే నేడు లక్ష్మీ దేవి ముందు వెలిగించే నెయ్యి దీపంలో రెండు లవంగాలు వేయాలి.
దీంతో పాటు లక్ష్మీదేవి ఫోటోకి యాలకుల మాల వేసి అమ్మవారికి నమస్కారం చేస్తే.. అప్పుల బాధల నుంచి గట్టెక్కుతారు. - ఆకస్మిక ధన లాభం: ధన లాభం కోరుకునే వారు.. నేడు తమలపాకు పైన కర్పూరం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి.
- భర్త ఆయుష్షు: భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని భావిస్తే.. పూజ చేసే ఆడవారు.. తమ మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకుని లక్ష్మీదేవిని పూజించాలి. దీని వల్ల భర్త ఆయుష్షు పెరగడమే కాక కుటుంబంలో ఆదాయం కూడా పెరుగుతుంది.
- ధనధాన్య వృద్ధి: లక్ష్మీ పంచమి నాడు పేదలకు బియ్యం, ధాన్యం దానం చేస్తే ఏడాదంతా ధనధాన్యాలకు కొరత ఉండదని నమ్ముతారు.
- గోమాత పూజ: గోమాతలో లక్ష్మీదేవి నివసిస్తుంది కనుక.. లక్ష్మీ పంచమి నాడు ఆవుకు పచ్చిగడ్డి తినిపించి నమస్కారం చేసుకుంటే కోరిన కోర్కెలు తీరతాయని నమ్ముతారు.
- కొత్త కొనుగోళ్లు: లక్ష్మీ పంచమి సందర్భంగా.. శక్తి మేర పిసరంత బంగారం, వెండి కొనుగోలు చేసినా.. కొత్త బిజినెస్‌లు ప్రారంభించినా.. అక్షరాభ్యాసం, వాహనాలు కొనుగోలు చేయడం వల్ల కలిసి వస్తుందని నమ్ముతారు.
సమస్యల నివారణకు:
- రాళ్ల ఉప్పు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కనుక.. నేడు కొత్త రాళ్ల ఉప్పు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకుని దానిని నీటిలో వేసి.. ఇల్లంతా శుభ్రం చేసుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయంటున్నారు.
- అలానే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ముట్టుకోవడం వల్ల శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ కటాక్షం లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
- తులసి చెట్టును పూజించి, పచ్చిపాలు పోస్తే ఆర్థికంగా కలిసి వస్తుందని నమ్ముతారు.
- పూజ గదిలో 5 పసుపు కొమ్ములను లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజ చేసి.. ఆ తర్వాత వాటిని బీరువాలో లేదంటే పర్సులో పెట్టుకుంటే ధనవంతులు అవుతారని చాలా మంది నమ్ముతారు.
లక్ష్మీదేవి పాదముద్రలు: ఇంటి లోపలికి వచ్చే ద్వారం నుండి పూజ గది వరకు బియ్యప్పిండితో లక్ష్మీదేవి పాదముద్రలు వేస్తే మహాలక్ష్మి మన ఇంటికి తరలి వస్తుందని నమ్ముతారు.
సాయంత్రం దీపారాధన: నేడు సూర్యాస్తమయం తర్వాత.. ఇంటి ముందు శుభ్రం చేసుకుని గుమ్మం బయట 2 దీపాలు వెలిగిస్తే.. అష్ట దరిద్రాలు తొలగి లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉంటుందని పండితులు చెబుతున్నారు.
వాస్తు దోషాల నివారణ: లక్ష్మీ పంచమి నాడు ఇంటి ఈశాన్యం మూలన కొంచెం కల్లుప్పును ఉంచితే వాస్తు దోషాలు తొలగి ఐశ్వర్యం పెరుగుతుందని నమ్ముతారు.
వ్యాపార అభివృద్ధి: వ్యాపారం చేసేవారు లక్ష్మీ పంచమి రోజు పసుపు రంగు వస్త్రంలో గోమతి చక్రాలను కట్టి.. గల్లా పెట్టెలో పెట్టుకుంటే నష్టాలు రావని.. లాభాలతో ఆర్థికాభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారు.
ఈ లక్ష్మీ పంచమి రోజున కనకధారా స్తోత్రం పఠించడం, ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను కట్టుకుంటే మంచిదని.. అలానే నేడు సాంబ్రాణి పొగ వేయడం వల్ల శుభం జరుగుతుందని నమ్ముతారు.
పైన చెప్పినవి పాటించలేని వారు ఆర్థిక స్థోమత లేని వారు.. నేడు లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించినా శుభం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఆహార నియమాలు: లక్ష్మీ పంచమికి ఒక రోజు ముందు పెరుగు అన్నాన్ని (ఉప్పు లేనిది) తినాలి. పంచమి రోజున మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి లేని ఆహారాన్ని తీసుకోవాలి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉన్నాయి. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని 10tv ధ్రువీకరించడం లేదు.
