Siva Temple
Lord Shiva : సాధారణంగా శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే ఆలయాలే మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే కొన్ని క్షేత్రాల్లో మాత్రమే విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. అలాంటి అరుదైన ఆలయాలు కొన్నే ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి శక్తీశ్వరాలయం. ఇక్కడ శివుడు విగ్రహరూపంతోపాటు తలక్రిందులుగా దర్శనమివ్వటం ప్రత్యేకత…ఆ అలయ విశేషాలేంటో తెలుసుకుందాం….
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావారి జిల్లాలో యనమదుర్రు అనే గ్రామంలో ఈ శక్తీశ్వరాలయం కొలువై ఉంది. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరానికి 7కిలోమీటర్ల దూరంలో యనమదుర్రు శక్తీశ్వరాలయం ఉంటుంది. ఈ ఆలయంలో ఒకే రాతిపై పార్వతీదేవి, శివుడు ఇద్దరు భక్తులకు దర్శనమిస్తుంటారు. పార్వతీదేవి ఒడిలో చిన్నారి బాలుడి రూపంలో కుమారస్వామి ఉండటాన్ని చూడవచ్చు. వీరంతా ఒకే పనివట్టంపై ఉండటమన్నది చాలా అరుదు.
ఆలయం చరిత్ర విషయానికి వస్తే తూర్పు చాళుక్యులు ఈ దేవలయాన్ని నిర్మించినట్లు ఇక్కడ లభించిన చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. ఈ క్షేత్రానికి రెండు స్థలపురాణాలు ఉన్నాయి. యముడు మోక్షం కోసం ఈ క్షేత్రంలో తపస్సు చేస్తాడు. శంబరుడు అనే పరమశివ భక్తుని ప్రాణాలు తీసేందుకు శివుడి అనుమతికోసం యముడు తపస్సు చేయటానికి ముఖ్యకారణం…అదే సమయంలో శివుడు శీర్షానంలో కైలాసంలో తపస్సు చేస్తుంటాడు. పార్వతి దేవి కుమారస్వామిని ఒడిలో లాలిస్తుంటుంది. యముడు తపస్సు క్రమంలో ఉన్నపళంగా శివపార్వతులు యధాస్ధితిలో ప్రత్యక్షమవ్వాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ శివుడు శీర్షాసనంలో పార్వతిదేవి చిన్నారి కుమారస్వామిని లాలించే రూపంలో దర్శనమిస్తారని స్ధలపురాణం ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా ప్రత్యక్షమైన శివుడు యముడికి ఒక వరం కూడా ఇస్తాడు. నీ పేరుమీద ఒక గ్రామం అందులో ఒక శివాలయం వెలుస్తుందని, అప్పడు నీపై ఉన్న అపప్రద తొలిగిపోతుందని చెప్తాడు. అందుకే ఈగ్రామాన్నియనమదుర్రుగా పేరు వచ్చిందని చెప్తుంటారు.
రెండో కథ విషయానికి వస్తే శంబిరుడు అనే రాక్షసరాజు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. ఈ పరిస్ధితుల్లో మునులంతా యమధర్మరాజు వద్దకు వెళ్లి తమ బాధలు చెప్పుకుంటారు. చిత్రగుప్తుడు శంబిరుడి ఆయువును లెక్కవేసి యముడికి సమాచారం అందిస్తాడు. శంబిరుడి ఆయువు త్వరలో తీరుపోతుందని దీంతో అతి త్వరలో ఆ రాక్షసుడిని సంహరిస్తారని యముడు వారికి చెబుతాడు. అయితే శంబిరుడు ఈశ్వరుడి పరమ భక్తుడు. గతంలో ఈశ్వర ఆజ్జ ప్రకారం ఈశ్వరుడి భక్తులను సంహరించాలంటే ముందుగా ఈశ్వరుడి అనుమతి తీసుకోవాలి. దీనిని జ్జప్తికి తెచ్చుకున్న యముడు యమనదుర్రులో ఘోర తప్పస్సు చేసి ఉన్నఫళంగా ప్రత్యక్షం కావాలని లేదంటే లోక వినాశనం తప్పదని శివుడిని వేడుకుంటాడు. ఆ సమయంలో శివుడు శీర్షాసనంలో తపస్సు చేస్తుంటాడు. ఆయన పక్కనే పార్వతీ దేవి కుమారస్వామిని ఒడిలో లాలిస్తుంటుంది. దీంతో పార్వతికి విషయం చెప్పి పరమశివుడు అదే స్థితిలో యముడికి ప్రత్యక్షమవుతాడు. అందువల్లే ఇక్కడ శివుడు శీర్షాసన స్థితిలో కనిపిస్తాడని శివపురాణం చెబుతోంది. ఈ ఆలయాన్ని దర్శిస్తే సర్వరోగాలు తొలగిపోతాయని చెప్తారు. అందుకే దూర ప్రాంతాల నుండి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు వస్తుంటారు.