Amaravati Temple
Amaravati : తిరుమల తిరుపతి దేవస్దానం అమరావతిలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జూన్ 9న ప్రాణ ప్రతిష్ట, మహా సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుందని టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆరోజు ఉదయంగం.7.30 నుండి గం.8.30ల వరకు మిథున లగ్నంలో ప్రాణ ప్రతిష్ట, మహాసంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నామని ఆయన చెప్పారు. టిటిడిఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవో వీరబ్రహ్మంతో కలిసి ఆయన సోమవారం అమరావతి ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా వైవీసుబ్బారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ మహాసంప్రోక్షణ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామివారు విచ్చేస్తారని అన్నారు.
ఇటీవల TTD పలు రాష్ట్రాల రాజధాని నగరాల్లో నిర్మించిన ఆలయాల కంటే ఇక్కడి ఆలయం చాలా పెద్దదని, సుమారు రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించామని వెల్లడించారు. ఇక్కడ 25 ఎకరాల స్థలం ఉందని, పచ్చదనం పెంచడంతో పాటు ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అర్టీసీ అధికారులతో చర్చించి చుట్టుపక్కల ఉన్న వివిధ ప్రాంతాల నుంచి భక్తులకు రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు.