Durga Malleswara Swamy (Photo : Google)
Durga Malleswara Swamy : కృష్ణా నదిలో రేపు(ఏప్రిల్ 7) శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ విగ్రహాల నదీ విహారం ఉంటుందని దుర్గగుడి పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. చైత్రమాస కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించామన్నారు.
మొదటి రోజు వెండి రథం, రెండవ రోజు రావణ వాహనం, మూడో రోజు నంది వాహనం, నాలుగో రోజు సింహ వాహనంపై స్వామి వార్ల ఊరేగింపు నేత్ర పర్వంగా సాగిందన్నారు. ఐదో రోజు పూర్ణాహుతి తర్వాత శ్రీ గంగ దుర్గ మల్లేశ్వర స్వామి వారి వెండి రథం ఊరేగింపు కార్యక్రమం జరిగిందన్నారు. చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను నదీ విహారం చేయాలని నిర్ణయించామన్నారు. పాలకమండలి కమిటీ.. దుర్గగుడి ఈవో అందరి సమన్వయంతో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు.
దుర్గగుడి ఈవో భ్రమరాంబ..
దసరా సమయంలో స్వామి వార్ల తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గతేడాది దసరా సమయంలో తెప్పోత్సవ కార్యక్రమం జరగకపోవడం అసంతృప్తి ఉంది. దానిని పోగొట్టేందుకు ఈ ఏడాది చైత్రమాస బ్రహ్మోత్సవాలలో ఉత్సవ విగ్రహాలకు నదీ విహార కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
Also Read..Tirumala : తిరుమలలో కాలినడక భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు.. మూడేళ్ల తర్వాత పున:ప్రారంభం
చైత్రమాసం బ్రహ్మోత్సవాలలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను జలవిహారం చేయడానికి నిర్ణయించాము. హంస వాహనంపై దుర్గ మల్లేశ్వర స్వామివార్లను మూడుసార్లు నదిలో ప్రదక్షిణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహిస్తారు. రేపు సాయంత్రం ఐదున్నర గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల జల విహారానికి అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తులు తరలివచ్చి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల జల విహారాన్ని వీక్షించి తరించాల్సిందిగా కోరుతున్నాం.