Varalakshmi Vratham 2023 : చారుమతిని కరుణించిన వరలక్ష్మీదేవి .. ఎవరీ చారుమతి..?ఆమెకు అమ్మవారు ఇచ్చిన వరాలేంటో తెలుసా..

చారుమతికి కరుణించిన వరలక్ష్మీదేవి. అష్టైశ్వర్యాలను ప్రసాదించింది. మరి ఎవరీ చారుమతి..? ఆమెకు అమ్మవారు ఇచ్చిన వరాలు ఇచ్చింది...? వరలక్ష్మీ పూజలు జరిగిన అద్భుతాలు ఏంటి..

Varalakshmi Vratham 2023

Varalakshmi Vratham 2023 : హిందు సంప్రదాయంలో వివాహం అయిన స్త్రీలు తమ సౌభాగ్యం కోసం ఎన్నో పూజలు చేస్తారు. భర్తల క్షేమం కోసం నోములు, వ్రతాలు చేస్తారు. నోములు, వ్రతాలు అనగానే అత్యంత పవిత్రమైన శ్రావణమాసం గుర్తుకొస్తుంది. వివాహితలు శ్రావణమాసం అనగానే ఈ మాసంలో వరలక్ష్మీదేవి పూజ ప్రధానమైనది.అటువంటి వరలక్ష్మీ పూజ ఎలా వచ్చింది..? ఎవరు ఈ పూజ విశిష్టత గురించి చెప్పారు?ఎవరికి చెప్పారు? అనే విషయం కూడా ప్రధానమైనదే. ఏ పూజకైనా,వ్రతానికైనా,నోములకైనా వాటి విశిష్టత తెలుసుకుంటేనే మరింత పుణ్యం కలుగుతుంది. శ్రావణమాసంలో ప్రధానమైన పండుగలలో వివాహితలు చేసుకునే వరలక్ష్మీ వ్రతం గురించి తెలుసుకుందాం..

స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతం ఏమైనా ఉందా స్వామీ అంటూ పార్వతీ దేవి తన భర్త పరమశివుడిని అడిగిందట. దానికి శివుడు సౌభాగ్యమే కాదు అష్ట ఐశ్వర్యాలతో పాటు సుఖసంతోషాలను కలిగించే వ్రతం ఉంది దేవీ అదే వరలక్ష్మీ వ్రతం అని తెలిపాడట..లయ కారకుడైన పరమ శివుడు పార్వతికి చెప్పిన ఆ కథ ఏమిటి..దాని విశిష్టతతో పాటు ఓ సాధారణ ఇల్లాలిని వరలక్ష్మీదేవి ఎలా కరుణించింది. ఎటువంటి వరాలు కురిపించిందో తెలుసుకుందాం..

Gurivinda Ginja : లక్ష్మీ కటాక్షాన్నిచ్చే గురివింద గింజలు .. దెబ్బకి దరిద్రం మాయం

పరమేశ్వరుడు ఒకరోజు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారదమహర్షి ఇంద్రాది దిక్పాలకులు పరమశివుడ్ని కీర్తిస్తుండగా..ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ‘‘నాథా! స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించే వ్రతం ఏమైనా ఉంటే చెప్పండీ అని అడిగిందట..దానికి ఆ శివుడు ‘‘దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉంది..అది వరలక్ష్మీవ్రతం.. ఈ వ్రతాన్ని శ్రావణమాసంలో రెండవ శుక్రవారం నాడు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఆచరించాలి’’అని చెప్పాడట. అప్పుడు పార్వతీదేవి…దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు?ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరగా శివుడు చారుమతి అనే ఓ గుణవతి గురించి చెప్పాడట..మరి ఎవరా చారుమతి అనే విషయం కూడా తెలుసుకుందాం..

శివుడు పార్వతితో చెప్పిన చారుమతి కథ..
మగథ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం అంతా లక్ష్మీదేవి స్వరూపమైన బంగారం ఎక్కడ చూసినా కనిపించేది. బంగారు గోడలతో వెలిగిపోతుండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒకబ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, పెద్దలంటే వినయం , విధేయత కలిగిన స్త్రీ. అత్తమామలను, భర్తను వారి బాగోగులు చూసుకునే యోగ్యురాలు. ఆమె రోజూ తెల్లవారుజామునే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి…ఇంట్లో పనులు పూర్తిచేసుకుని అత్తమామల్ని గౌరవమర్యాదలతో సేవించేది. అటువంటి చారుమతి గుణగణాలు మెచ్చిన వరలక్ష్మీదేవి చారుమతిని కరుణించింది. వరలక్ష్మీదేవి చారుమతికి కలలో కనిపించింది.

‘ఓ చారుమతీ నీవు యోగ్యురాలైన స్త్రీవి..అందుకే నిన్ను కరుణించాలని వచ్చాను. ఈ శ్రావణపౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నన్ను పూజించు… నీవు కోరిన వరాలు, కానుకలు, సకల సౌభాగ్యాలు ఇస్తాను’ అని చెప్పి అంతర్థానమైంది. వెంటనే మెలకువ చ్చిన చారుమతికి ఎంతో సంతోషించింది. భర్తకు, అత్తమామలకు ఈ విషయం చెప్పింది. వారు సంతోషంగా వ్రతం చేసుకోమ్మని చెప్పారు.

అలా శ్రావణమాసంలో శుక్రవారం రోజున ఇరుగు పొరుగు ముత్తైవుదులను పిలిచి ఇంట్లోనే మండపం ఏర్పాటు చేసి అమ్మవారిని చక్కగా అలంకరించింది. భక్తి శ్రద్ధలతో పూజించింది. అత్యంత భక్తితో పలు రకాల పిండివంటలతో నైవేద్యం పెట్టింది. తొమ్మిది పోగుల దారంతో మధ్యలో పువ్వులు, ఆకులతో కలిపి తోరణాన్ని తయారు చేసి ఆ తోరాన్ని చేతికి కట్టుకుంది. ఆమెతో పాటు ముత్తైదువలు కూడా చేశారు. అమ్మవారి చుట్టు ప్రదక్షిణాలు చేసి భక్తిగా దణ్ణం పెట్టుకున్నారు. ప్రదక్షిణాలు చేసే సమయంలో చారుమతికి, ముతైదువలకు అద్భుతమైన వరాలు వచ్చి చేరాయి. అవేమిటంటే..మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జెలు, రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచిత కంకణాలు, మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ ఒంటినిండా నగలతో నిండిపోయారు. సర్వాభరణ భూషితులుగా కళకళలాడుతు కనిపించారు. దానికి అందరు ఆశ్చర్యపోయారు.

Varalakshmi Puja 2023 : ఈ ఏడాది అధిక శ్రావణ మాసాలు, వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలో తెలుసా..?

ఈ వరాలన్నీ చారుమతి వల్లే వచ్చాయని అంత నీ పూజ చలవే అంటూ చారుమతిని పొగిడారు.దానికి చారుమతి ఎంతో వినయంగా అయ్యో ఇదంతా ఆ వరలక్ష్మీ దేవి చలువే..ఆ అమ్మవారి ఇచ్చిన వరాలే అంటూ చెప్పింది. అలా వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతితో పాటూ ఆ వ్రతానికి వచ్చిన వారందరి ఇళ్లలో సకల భోగాలు వచ్చాయట. అప్పటి నుంచి వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలు కలిగి సంతోషంగా ఉన్నారు. అటువంటి గొప్ప వ్రతం గురించి శివుడు చెప్పగా పార్వతీ దేవితో పాటు కైలాసంలో స్త్రీలు అంతా వరలక్ష్మీదేవి వ్రతం చేసుకోవటం ప్రారంభించారు. అలా వరలక్ష్మీదేవి వ్రతం ప్రాముఖ్యత భూలోకంలోని స్త్రీలకు కూడా అందుబాటులో ఉండేలా అమలులోకి వచ్చిందట..

 

ట్రెండింగ్ వార్తలు