తిరుమల భక్తులకు మరింత భారం పడనుంది. మధ్యతరగతికి వసతి గదుల అద్దెను మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తిరుమలలో అందుబాటులో ఉండే నందకం అద్దె గదులను రూ.600 నుంచి రూ.1000కి పెంచనున్నారు. దీంతోపాటుగా గతంలో కౌస్తుభం, పాంచజన్యంలో రూ.500వరకూ ఉన్న అద్దెను రూ.1000కి పెంచనున్నారు. పెరిగిన ధరలను నవంబరు 8నుంచి దేవస్థానం అమలు చేయనుంది.
శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకోసం తిరుమలలో రూ.50 నుంచి రూ.3వేల వరకు వసతి సదుపాయం ఉంది. ఆన్‌లైన్, ఈ దర్శన్‌ల ద్వారా ప్రస్తుతం రూ.100, రూ.500, రూ.600, రూ.999, రూ.1500 వసతిని మాత్రమే కేటాయించేవారు. సాధారణ వసతి కేటగిరీలో రూ.100, రూ.500, రూ.600లు, ఏసీ కేటగిరీలో రూ.999, రూ.1500లు వస్తాయి. తిరుమల భక్తులు అత్యధికంగా రూ.100 గదుల్లో ఉండేందుకు ఆసక్తి చూపుతారు.
అవి దొరకని వారు రూ.100 వసతి గదులు చాలా తక్కువగా కేటాయించటంతో అవి దొరకని వారు రూ.500, రూ.600 వసతిని పొందేవారు. మధ్య, ఎగువ మధ్యతరగతికి ఇవి అందుబాటులో ఉండేవి. తిరుమలలో వసతిని పెంచినప్పటికీ తిరుపతిలో మాత్రం యథావిధిగా ఉంచారు. శ్రీనివాసం సాధారణ గది రూ.200, ఏసీ రూ.400, డీలక్స్ ఏసీ రూ.600, మాధవంలో ఏసీ రూ.800, డీలక్స్ ఏసీ రూ.1000, తిరుచానూర్(పద్మావతి అమ్మవారి ఆలయం)లో ఏసీ రూ.300, సాధారణ గది రూ.100 చొప్పున ఆన్‌లైన్, ఈ-దర్శన్‌ల ద్వారా రేట్లను అందుబాటులో ఉంచుతున్నారు.