AFG vs PAK Haris Rauf Breaks Multiple Batting Records
Haris Rauf world Record : ముక్కోణపు సిరీస్‌లో భాగంగా మంగళవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాడు హారిస్ రవూఫ్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 10వ స్థానంలో బరిలోకి దిగిన రవూఫ్ 16 బంతులను ఎదుర్కొని 4 సిక్సర్లు బాది 34 పరుగులతో అజేయంగా నిలిచాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో 10 లేదా 11వ స్థానంలో వచ్చి అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా విండీస్ ఆటగాడు అకీల్ హొసేన్‌తో కలిసి రవూఫ్ వరల్డ్ రికార్డును (Haris Rauf world Record ) షేర్ చేసుకున్నాడు. అంతేకాదండోయ్.. పాక్ తరుపున 10 లేదా 11 నంబర్ బ్యాటర్లలో అత్యధిక స్కోరు సాధించిన బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కాడు.
ఇక ఆఖరి వికెట్‌కు సూఫియాన్ ముఖీమ్((7 నాటౌట్))తో రవూఫ్ 40 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. టీ20ల్లో ఆఖరి వికెట్‌కు పాక్ తరుపున ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. గతంలో ఈ రికార్డు షోయబ్ అక్తర్-వాహబ్ రియాజ్ పేరిట ఉండేది. షోయబ్ అక్తర్-వాహబ్ రియాజ్ జోడీ 31 పరుగులతో అజేయంగా నిలిచింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సెడిఖుల్లా అటల్ (64; 45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (65; 45 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) లు హాఫ్ సెంచరీలతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో ఫహీం అష్రఫ్ నాలుగు వికెట్లు తీయగా.. సైమ్ అయూబ్ ఓ వికెట్ సాధించాడు.
అనంతరం హరీస్ రవూఫ్(34 నాటౌట్), ఫఖార్ జమాన్ (25) లు రాణించనప్పటికి కూడా మిగిలిన వారు విఫలం కావడంతో పాక్ లక్ష్య ఛేదనలో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులకే పరిమితమైంది. దీంతో 18 పరుగుల తేడాతో అఫ్గాన్ విజయం సాధించింది. అఫ్గాన్ బౌలర్లలో ఫజల్హాక్ ఫరూఖీ, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, నూర్ అహ్మద్ లు తలా రెండు వికెట్లు సాధించారు.