Kieron Pollard : కీరన్ పొలార్డ్ అరుదైన ఘనత.. ఎలైట్ జాబితాలో చోటు.. షిమ్రాన్ హిట్‌మయర్‌ను వెనక్కినెట్టి..
కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2025లో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు కీరన్ పొలార్డ్ (Kieron Pollard) దుమ్మురేపుతున్నాడు.

Kieron Pollard on elite list with explosive half century in CPL 2025
Kieron Pollard : కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2025లో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు కీరన్ పొలార్డ్ దుమ్మురేపుతున్నాడు. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పొలార్డ్ (Kieron Pollard) సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 38 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. మొత్తంగా 29 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 65 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్‌లో అర్థశతకం సాధించడం ద్వారా పొలార్డ్ ఓ ఎలైట్ జాబితాలో చోటు సంపాదించాడు. సీపీఎల్ లీగ్‌లో అత్యధిక సార్లు 50+ స్కోరు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 8వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడు షిమ్రాన్ హిట్‌మయర్‌ను అధిగమించాడు. ఈ లీగ్ చరిత్రలో హిట్‌మయర్ 15 సార్లు 50+ స్కోర్లు నమోదు చేయగా.. తాజా హాప్ సెంచరీతో కలిపి పొలార్డ్ 16 సార్లు ఈ ఘనత అందుకున్నాడు.
ENG vs SA : చరిత్ర సృష్టించిన మార్‌క్రమ్.. ఇంగ్లాండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన దక్షిణాఫ్రికా..
ఇక ఈ జాబితాలో జాన్సన్ ఛార్లెస్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు 23 సార్లు 50+స్కోర్లను నమోదు చేశాడు. ఆ తరువాత ఆండ్రీ ఫ్లెచర్, కొలిన్ మున్రో, లెండిల్ సిమన్స్ తదితరులు ఉన్నారు.
సీపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 50+ స్కోర్లు సాధించిన ఆటగాళ్లు వీరే..
* జాన్సన్ చార్లెస్ – 23 సార్లు
* ఆండ్రీ ఫ్లెచర్ – 21 సార్లు
* కొలిన్ మున్రో – 20 సార్లు
* లెండిల్ సిమన్స్ – 20 సార్లు
* ఎవిన్ లూయిస్ – 19 సార్లు
* నికోలస్ పూరన్ – 18 సార్లు
* క్రిస్ గేల్ – 17 సార్లు
* కీరన్ పొలార్డ్ – 16 సార్లు
* షిమ్రాన్ హెట్‌మయర్ – 15 సార్లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ బ్యాటర్లలో పొలార్డ్ (52), నికోలస్ పూరన్ (65) అర్ధశతకాలతో చెలరేగారు. సెయింట్ కిట్స్ బౌలర్లలో జాసన్ హోల్డర్ రెండు వికెట్లు తీశాడు.
Mohammad Nabi : టీ20 క్రికెట్‌లో నబీ అరుదైన ఘనత.. అఫ్గాన్ చేతిలో పాక్ ఓటమి..
అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ కిట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులకే పరిమితమైంది. దీంతో నైట్‌రైడర్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. సెయింట్ కిట్స్ బ్యాటర్లలో ఆండ్రీ ఫ్లెచర్ (67) హాఫ్ సెంచరీ బాదగా.. ఎవిన్ లూయిస్ (42) రాణించారు. మిగిలిన వారు విఫలం అయ్యారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో నాథన్ ఎడ్వర్డ్స్ మూడు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ అమీర్ రెండు వికెట్లు సాధించాడు. ఉస్మాన్ తారిఖ్ ఓ వికెట్ తీశాడు.