Mohammad Nabi : టీ20 క్రికెట్‌లో నబీ అరుదైన ఘనత.. అఫ్గాన్ చేతిలో పాక్ ఓటమి..
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అఫ్గానిస్థాన్ స్టార్ ప్లేయర్ మహ్మద్ నబీ (Mohammad Nabi)అరుదైన ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్‌లో నబీ..

Mohammad Nabi becomes only second player in T20I cricket to achieve rare double
Mohammad Nabi : అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అఫ్గానిస్థాన్ స్టార్ ప్లేయర్ మహ్మద్ నబీ అరుదైన ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్‌లో నబీ 2000 పరుగులు చేయడంతో పాటు 100 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా మంగళవారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫఖర్ జమాన్ వికెట్ తీయడం ద్వారా ఈ ఘనత సాధించాడు.
నబీ (Mohammad Nabi) కంటే ముందు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్(Shakib Al Hasan) (129 మ్యాచ్‌ల్లో 2551 పరుగులు, 149 వికెట్లు) మాత్రమే ఈ ఘనత సాధించాడు.
బ్యాటింగ్‌లో నబీ ఎప్పుడో 2000 పరుగులు చేశాడు. పాక్‌తో మ్యాచ్‌లో వంద వికెట్ల క్లబ్‌లో చేరాడు. మొత్తంగా 40 ఏళ్ల నబీ 134 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 2246 పరుగులు చేయడంతో పాటు 101 వికెట్లు పడగొట్టాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో సెడిఖుల్లా అటల్ (64; 45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (65; 45 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) లు హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగిలిన వారిలో ఎవ్వరూ కూడా రెండు అంకెల స్కోరు చేయలేదు. పాక్ బౌలర్లలో ఫహీం అష్రఫ్ నాలుగు వికెట్లు తీశాడు. సైమ్ అయూబ్ ఓ వికెట్ సాధించాడు.
అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులకే పరిమితమైంది. దీంతో అఫ్గాన్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Sanju Samson vs Shubman : సంజూ శాంసన్ వర్సెస్ శుభ్‌మన్ గిల్.. అంతర్జాతీయ టీ20ల్లో ఎవరు తోపు?
పాక్ బ్యాటర్లో హరీస్ రవూఫ్(34 నాటౌట్), ఫఖార్ జమాన్ (25) లు రాణించగా మిగిలిన వారు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. అఫ్గాన్ బౌలర్లలో ఫజల్హాక్ ఫరూఖీ, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, నూర్ అహ్మద్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.