Afghanistan : పాకిస్తాన్ వైమానిక దాడి.. ముగ్గురు అఫ్గానిస్థాన్ క్రికెటర్లు మృతి.. అఫ్గాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. రషీద్ ఖాన్ ట్వీట్ వైరల్

Afghanistan : పాకిస్థాన్ వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. వీరిలో ముగ్గురు అఫ్గాన్ క్రికెటర్లు ఉన్నారు.

Afghanistan : పాకిస్తాన్ వైమానిక దాడి.. ముగ్గురు అఫ్గానిస్థాన్ క్రికెటర్లు మృతి.. అఫ్గాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. రషీద్ ఖాన్ ట్వీట్ వైరల్

Afghanistan

Updated On : October 18, 2025 / 8:40 AM IST

Afghanistan : పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా.. పాకిస్థాన్ వైమానిక దాడుల్లో ముగ్గురు క్రికెట్లర్లు సహా ఎనిమిది మంది మరణించారు.

ఈస్ట్రన్ పాక్టికా ప్రావిన్సుపై పాకిస్థాన్ వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు అఫ్గానిస్థాన్ దేశవాళి క్రికెటర్లు ఉన్నారు. ఈ విషయాన్ని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) ధ్రువీకరించింది.

అఫ్గాన్ క్రికెట్ బోర్డు ప్రకారం.. తూర్పు పాక్టికా ప్రావిన్స్ రాజధాని షరానాకు స్నేహపూర్వక మ్యాచ్ ఆడేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతిచెందిన ముగ్గురు క్రికెటర్లు కబీర్ అఘా, సిబాతుల్లా, హరూన్ గా గుర్తించారు. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి తిరిగి వస్తుండగా పాక్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో ఈ ముగ్గురు క్రికెటర్లు మరణించారు.

 

‘‘పాక్టికా ప్రావిన్సులోని ఉర్గున్ జిల్లాకు చెందిన ముగ్గురు క్రికెటర్లు పాక్ వైమానిక దాడిలో ప్రాణాలు విడిచారు. పాక్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన దాడిలో అప్గాన్ పౌరులు మృతిచెందారు. దీనిపై అఫ్గాన్ క్రికెట్ బోర్డు తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. ఈ దాడిలో క్రికెటర్లతో పాటు మరో ఐదుగురు అఫ్గాన్ పౌరులుసైతం ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా అఫ్గాన్ క్రికెట్ బోర్డు సంతాపం తెలియజేస్తూ పోస్టు పెట్టింది.
ఈ ఘటన తరువాత అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో పాకిస్థాన్, శ్రీలంక జట్టతో తలపడబోయే ముక్కోణపు సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఇందులో పాకిస్థాన్ జట్టు కూడా ఉండటంతోనే ఈ సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు ఏసీబీ వెల్లడించింది.

ఇదిలాఉంటే.. అక్టోబర్ 11 నుంచి పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబాన్లపై పాకిస్థాన్ ఆర్మీ వైమానిక దాడులు నిర్వహించింది. దీంతో తాలిబాన్లు పాకిస్థాన్ పై ప్రతీకార దాడులకు దిగారు. పాకిస్థాన్ సరిహద్దుల్లోని ఆ దేశంకు చెందిన సైన్యం ఔట్ పోస్టుపై డ్రోన్ బాంబులతో దాడి చేశారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో పాకిస్థాన్ సైనికులు మరణించారు. ఇలా రెండు దేశాల సరిహద్దుల్లో వరుస దాడులు జరుగుతున్నాయి. తాజాగా పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో ముగ్గురు అఫ్గాన్ దేశవాళి క్రికెటర్లతోపాటు మరో ఐదుగురు పౌరులు మరణించారు.

పాకిస్థాన్ దుశ్చర్యపై అఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ స్పందించారు. ‘పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్‌పై జరిపిన వైమానిక దాడుల్లో పౌరులు మరణించడం నాకు చాలా బాధ కలిగించింది. ప్రపంచ వేదికపై తమ దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్న మహిళలు, పిల్లలు మరియు ఆశావహ యువ క్రికెటర్ల ప్రాణాలను బలిగొన్న విషాదం ఇది. పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం పూర్తిగా అనైతికం, అనాగరికం. ఈ అన్యాయమైన, చట్టవిరుద్ధమైన చర్యలు మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘనను సూచిస్తాయి. వాటిని గమనించకుండా ఉండకూడదు. కోల్పోయిన విలువైన అమాయక ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని, పాకిస్తాన్‌తో జరగబోయే మ్యాచ్‌ల నుండి వైదొలగాలనే ACB నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో నేను అఫ్గాన్ ప్రజలతో నిలబడతాను, మన జాతీయ గౌరవం అన్నింటికంటే ముందుండాలి.’ అంటూ రషీద్ ఖాన్ ట్వీట్ లో పేర్కొన్నారు.