AUS vs AFG: టీ20 వరల్డ్ కప్‌లో మరో సంచలనం.. ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్ జట్టు విజయం

టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ సూపర్-8 మ్యాచ్ లో ఆఫ్గానిస్థాన్ జట్టు సంచలన విజయం సాధించింది. పదునైన బంతులతో ఆస్ట్రేలియా బ్యాటర్లకు ఆఫ్గాన్ బౌలర్లు చుక్కలు చూపించారు.

AUS vs AFG: టీ20 వరల్డ్ కప్‌లో మరో సంచలనం.. ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్ జట్టు విజయం

Afghanistan vs Australia : టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ సూపర్-8 మ్యాచ్ లో అఫ్గానిస్థాన్ జట్టు సంచలన విజయం సాధించింది. పదునైన బంతులతో ఆస్ట్రేలియా బ్యాటర్లకు అఫ్గాన్ బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఆస్ట్రేలియా బ్యాటర్లు విఫలమయ్యారు. సూపర్ -8 విభాగం గ్రూప్-1లో ఆదివారం ఉదయం 6గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఆస్ట్రేలియా వర్సెస్ అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. ఓపెనర్లు గుర్బాజ్ (60), ఇబ్రహీం జద్రాన్ (51) హాప్ సెంచరీలు సాధించారు. ఓపెనర్లు ఇద్దరు ఔట్ అయినప్పటికీ .. ఆఫ్గాన్ జట్టు పటిష్ట స్థితిలో ఉంది. అయితే, పేసర్ పాట్ కమిన్స్ వరుసగా హ్యాట్రిక్ వికెట్లుతీసి అఫ్గాన్ జట్టు భారీ స్కోర్ చేయకుండా అడ్డుకట్ట వేశారు.

Also Read : చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచకప్‌లో అలాచేసిన తొలి బ్యాట్స్‌మెన్‌ అతనే..

149 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా లక్ష్య చేధనలో విఫలమైంది. ఆస్ట్రేలియా బ్యాటర్లు మ్యాక్సివెల్ (59) మినహా మిగిలిన బ్యాటర్లు పరుగుల రాబట్టడంలో విఫలమయ్యారు. అఫ్గానిస్థాన్ బౌలర్ గుల్బాడిన్ నైబ్ నాలుగు ఓవర్లు వేసి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు.  మరోబౌలర్ నవీన్ ఉల్ హక్ మూడు వికెట్లు తీసి ఆస్ట్రేలియా బ్యాటర్లను తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టించారు. దీంతో ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా 21 పరుగుల తేడాతో అఫ్గాన్ జట్టు విజయం సాధించింది. అఫ్గానిస్థాన్ జట్టు ఆస్ట్రేలియాను ఓడించడం ఇదే తొలిసారి.

Also Read : Ind Vs Ban : బంగ్లాదేశ్‌పై 50 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.. సెమీస్‌ బెర్త్ ఖాయం!

ఆస్ట్రేలియాపై అఫ్గాన్ జట్టు సంచలన విజయంతో గ్రూప్-1 నుంచి సెమీఫైనల్ కు ఏరెండు జట్లు వెళ్తాయనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. టీమిండియా ఆడిన రెండు మ్యాచ్ లలో విజయం సాధించి దాదాపు సెమీస్ బెర్తును ఖరారు చేసుకోగా.. ఆసీస్, అఫ్గాన్ ఒక్కో గెలుపుతో రేసులో నిలిచాయి. ఈనెల 24న రాత్రి 8గంటలకు (భారత కాలమానం ప్రకారం) భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు ఓడిపోయి.. ఈనెల 25న ఉదయం 6గంటలకు (భారత కాలమానం ప్రకారం) బంగ్లాదేశ్ వర్సెస్ అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో అఫ్గాన్ విజయం సాధిస్తే భారత్ జట్టుతో పాటు సెమీస్ కు అఫ్గాన్ చేరుతుంది.