APL 2024 Qualifier 2
ఆంధ్రా ప్రీమియర్ లీగ్(ఏపీఎల్)లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయలసీమ కింగ్స్ కథ ముగిసింది. క్వాలిఫైయర్-2లో వైజాగ్ వారియర్స్ చేతిలో 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వర్షం అంతరాయం మధ్య వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ మైదానంలో ఈ మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వైజాగ్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. వారియర్స్ బ్యాటర్లలో అశ్విన్ హెబ్బర్ (58 బంతుల్లో 81 నాటౌట్), కేఎస్ భరత్ (26 బంతుల్లో 53) లు అర్ధశతకాలతో రాణించారు. మునీశ్ వర్మ(12) తొందరగానే ఔటైనా వీరిద్దరు కింగ్స్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. పోటాపోటీగా పరుగులు సాధించారు.
రెండో వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆఖరిలో మువ్వల యువన్ (12 బంతుల్లో 24) రాణించడంతో వారియర్స్ భారీ స్కోర్ సాధించింది. రాయలసీమ కింగ్స్ బౌలర్లలో గిరినాథ్ రెడ్డి, మిద్దె ఆంజనేయులు చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయలసీమ కింగ్స్‌కు మూడో ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఓపెనర్ తన్నీరు వంశీకృష్ణ(7) తక్కువ స్కోరుకే ఔట్ అయ్యాడు. మరోవైపు వారియర్స్ కెప్టెన్ అశ్విన్ హెబ్బర్ బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించడంతో కింగ్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఓవైపు సాధించాల్సిన రన్‌రేట్ అంతకంతకు పెరుగడం మిడిలార్డర్‌లో పరుగుల రాక మందగించింది. కెప్టెన్ గిరినాథ్‌రెడ్డి, గుత్తా రోహిత్ కలిసి ఐదో వికెట్‌కు 36 బంతుల్లో 59 పరుగులు జతచేసి పోటీలోకి వచ్చే ప్రయత్నం చేశారు.
అయితే కొడవండ్ల సుదర్శన్ ఈ జోడీని విడదీయడం ద్వారా వారియర్స్ పైచేయి సాధించింది. ఆఖర్లో షేక్ కమ్రుద్దీన్ 7 బంతుల్లో 22 పరుగులతో ఒంటరిపోరాటం చేసినా కింగ్స్‌కు లాభం లేకపోయింది.