Arjun Tendulkar: ఐపీఎల్‌లో తొలి వికెట్ తీసిన అర్జున్ టెండూల్కర్ .. రోహిత్ ఫుల్ ఖుషీ.. సంబరాలు అదుర్స్ ..

19.5 ఓవర్లో భువనేశ్వర్ కుమార్‌ను ఔట్ చేయడం ద్వారా అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్‌లో తన తొలి వికెట్‌ను దక్కించుకున్నాడు.

Arjun Tendulkar

Arjun Tendulkar: లెంజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ మ్యాచ్‌లో తన తొలి వికెట్ తీశాడు. అతను ఆడిన రెండో మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. చివరి ఓవర్‌లో అర్జున్ తొలి వికెట్ తీయగానే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టీం సభ్యులు అర్జున్‌ను అభినందనలతో ముంచెత్తారు. ప్రేక్షకులుసైతం అర్జున్, అర్జున్ అంటూ పెద్ద‌ఎత్తున నినాదాలు చేయడంతో స్టేడియం అర్జున్ నామస్మరణతో మారుమోగిపోయింది. ఈనెల 16న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ లోకి అరంగ్రేటం చేసిన అర్జున్.. ఆ మ్యాచ్ లో వికెట్ దక్కించుకోలేక పోయాడు.

Arjun Tendulkar 1st Wicket in IPL

ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మంగళవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ముంబై ఇండియన్స్ వరుసగా మూడో విజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ ఛేదించలేక పోయింది. 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 14 పరుగులతో రోహిత్ శర్మ టీం విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తన తొలి వికెట్ తీశాడు. తొలి స్పెల్‌లో వికెట్ దక్కకపోయినా రెండో స్పెల్‌లో అర్జున్ రాణించాడు.

Arjun Tendulkar 1st Wicket in IPL

ముంబై జట్టు బౌలింగ్ ను ప్రారంభించిన అర్జున్ టెండుల్కర్ వరుసగా తొలి స్పెల్ లో రెండు ఓవర్లు వేశాడు. తొలి రెండు ఓవర్లలో 14 పరుగులు ఇచ్చాడు. అయితే, అతనికి వికెట్ మాత్రం దక్కలేదు. సన్‌రైజర్స్ జట్టు చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ అర్జున్ టెండూల్కర్‌కు బాల్ ఇచ్చాడు. ఆ ఓవర్లో మూడు బంతుల్లో ఒక వైడ్ వేసిన అర్జున్ తరువాత రెండు బంతులు కట్టుదిట్టంగా సంధించాడు.

Arjun Tendulkar 1st Wicket in IPL

19.5 ఓవర్లో భువనేశ్వర్ కుమార్ ను ఔట్ చేయడం ద్వారా ఐపీఎల్ లో తన తొలి వికెట్ ను దక్కించుకున్నారు. దీంతో రోహిత్ శర్మతో పాటు టీం సభ్యులు అర్జున్ తోకలిసి సంబరాలు చేసుకున్నారు. గ్రౌండ్ మొత్తం కొద్దిసేపు అర్జున్ అర్జున్ అనే నామస్మరణతో మారుమోగిపోయింది.