×
Ad

Asia Cup 2025 Final : మాతో పెట్టుకుంటే ఇట్లనే ఉంటది..! హారిస్ రవూఫ్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన జస్ర్పీత్ బుమ్రా.. మిసైల్ సంబరాలు

Asia Cup 2025 Final : ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ పేసర్ హారిస్ రవూఫ్‌‌కు బుమ్రా కౌంటర్ ఇచ్చాడు.

Jasprit Bumrah

Asia Cup 2025 Final Jasprit Burmah : ఆసియా కప్ – 2025 విజేతగా భారత్ జట్టు నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్ పోరులో పాకిస్తాన్ జట్టును మట్టికరిపించింది. ఐదు వికెట్ల తేడాతో విజయదుంధుబి మోగించింది. పాక్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది.

Also Read: PM Modi: పాకిస్తాన్‌ను మట్టికరిపించిన భారత్.. ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్..

తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. 147 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ స్వల్ప పరుగులకే ఔట్ అయ్యారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా వెంటనే పెవిలియన్ బాటపట్టాడు. ఆ తరువాత తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (69నాటౌట్), సంజూ శాంసన్ (24), శివమ్ దూబె( 33) రాణించడంతో టీమిండియా విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో జస్ర్పీత్ బుమ్రా పాకిస్థాన్ బౌలర్ హారిస్ రవూఫ్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన టీమిండియా ఫ్యాన్స్ బుమ్రా తీరుపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.


పాకిస్థాన్ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో హారిస్ రవూఫ్‌ను అద్భుత బంతితో క్లీన్‌బౌల్డ్ చేసిన జస్ర్పీత్ బుమ్రా.. భిన్నంగా సంబరాలు చేసుకున్నాడు. తాను వేసిన బంతి మిసైల్‌లా దూసుకొచ్చి వికెట్లను కూల్చిందన్న అర్ధం వచ్చేలా మిసైల్ కూలినట్లుగా సంజ్ఞ చేశాడు. భారత్‌తో సూపర్ -4 మ్యాచ్‌లో పేసర్ రవూఫ్ వివాదాస్పద రీతిలో ఆరు యుద్ధ విమానాలను కూల్చినట్లు సంజ్ఞలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద దుమారం రేగింది. అతడికి మ్యాచ్ ఫీజులో 30శాతం జరిమానా కూడా పడింది. తాజాగా.. బుమ్రా వికెట్ తీసిన సమయంలో మిసైల్ సంబరాలు చేసుకొని హారిస్ రవూఫ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు.