Asia Cup 2025 Final Team India refuse Asia cup trophy and medals
IND vs PAK : ఆసియాకప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఆసియాకప్‌ను తొమ్మిదో సారి కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్ (57; 38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫఖర్ జమాన్ (46; 35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీశాడు. బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌లు తలా రెండు వికెట్లు తీశారు.
అనంతరం 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ (69; 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ బాదాడు. శివమ్ దూబె (33; 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), సంజూ శాంసన్ (24; 21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. పాక్ బౌలర్లలో ఫహీం అష్రఫ్ మూడు వికెట్లు తీశాడు. షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్ లు చెరో వికెట్ సాధించారు.
ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిప్పటికి కూడా భారత్.. ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడైన మోహ్‌సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించలేమని వెల్లడించింది. దీంతో ప్రజెంటేషన్ వేడుక గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. పాక్ ఆటగాళ్లు రన్నరప్ మెడల్స్‌ను స్వీకరించారు. ఆ తరువాత తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, అభిషేక్ శర్మలు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డులను అందుకున్నారు.
A TROPHY CELEBRATION WITHOUT THE TROPHY. 🤣🇮🇳pic.twitter.com/R4Esf1CzgA
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 29, 2025
ఆ తరువాత ఓటమిపై పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా స్పందించాడు. ఆ తరువాత హోస్ట్ సైమన్ డౌల్ మాట్లాడుతూ.. భారత జట్టు ట్రోఫీని స్వీకరించేందుకు సిద్ధంగా లేదన్నాడు. ఇక గెలిచిన భారత జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాట్లాడకుండానే వేడుక ముగిసింది.
అయితే.. భారత జట్టు ట్రోఫీని తరువాత తీసుకుంటుందా? లేదా అలాగే వదిలేస్తుందా? అన్నది చూడాలి.