Asia Cup 2025 Final : మేము అందుకే ఓడిపోయాం.. ఫైనల్లో ఓటమిపై పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కీలక కామెంట్స్..

Asia Cup Final: ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాపై ఓటమి అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.

Asia Cup 2025 Final : మేము అందుకే ఓడిపోయాం.. ఫైనల్లో ఓటమిపై పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కీలక కామెంట్స్..

Salman Ali Agha

Updated On : September 29, 2025 / 7:39 AM IST

Asia Cup 2025 Final : ఆసియా కప్ – 2025 విజేతగా భారత్ జట్టు నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్ పోరులో పాకిస్తాన్ జట్టును మట్టికరిపించింది. ఐదు వికెట్ల తేడాతో విజయదుంధుబి మోగించింది. పాక్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. అయితే, మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.

Also Read: Asia Cup 2025 Final : మాతో పెట్టుకుంటే ఇట్లనే ఉంటది..! హారిస్ రవూఫ్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన జస్ర్పీత్ బుమ్రా.. మిసైల్ సంబరాలు

‘ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం. వీలైనంత త్వరగా తమ బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకోవాలి. ఫైనల్లో ఓడినా.. తమ జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. కానీ, బ్యాటింగ్ వైఫల్యం మా విజయ అవకాశాలను దెబ్బతీసింది. మా బ్యాటింగ్‌లో మేం వరుసగా వికెట్లు కోల్పోయాం. బౌలింగ్‌లో అద్భుతంగా రాణించినప్పటికీ.. బోర్డుపై సరిపడా పరుగులు లేవు. స్ట్రైక్ రొటేట్ చేయకుండా వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాం. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. చివరి ఆరు ఓవర్లలో భారత్‌కు 63 పరుగులు అవసరమైనప్పుడు కూడా మేము గెలుస్తామని అనుకున్నాం. కానీ, బ్యాటింగ్ వైఫల్యం మాకు తీరని నష్టం చేసింది. ఈ మ్యాచ్‌లో ఓడినా జట్టు పోరాడిన తీరు పట్ల గర్వంగా ఉంది. మేము మరింత కష్టపడి భవిష్యత్తులో మెరుగైన ప్రదర్శన చేస్తాం’ అంటూ సల్మాన్ అలీ చెప్పుకొచ్చాడు.


ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జట్టు విజయంలో కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మలు కీలక భూమిక పోషించారు. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టి పాకిస్థాన్ పతనాన్ని శాసించగా.. 53 బంతుల్లో 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన తిలక్ వర్మ పాకిస్థాన్ జట్టుకు విజయాన్ని దూరం చేశాడు.


ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు ఓపెనర్లు పర్హాన్ (57), ఫకర్ జమాన్ (46) రాణించారు. ఆ తరువాత కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలం, బుమ్రా అద్భుత బంతులతో మిగిలిన బ్యాటర్లు తక్కువ పరుగులకే వెంటవెంటనే పెలియన్ బాటపట్టారు. 147 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్లు అభిషేక్ శర్మ (5), శుభ్‌మన్ గిల్ (12) స్వల్ప పరుగులకే ఔట్ అయ్యారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1) కూడా వెంటనే పెవిలియన్ బాటపట్టాడు. ఆ తరువాత తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (69నాటౌట్), సంజూ శాంసన్ (24), శివమ్ దూబె( 33) రాణించడంతో టీమిండియా విజయం సాధించింది.