Asia Cup 2025 IND vs BAN Every team has ability to beat India says Bangladesh coach Phil Simmons
IND vs BAN : ఆసియాకప్ 2025లో భాగంగా నేడు (బుధవారం సెప్టెంబర్ 24న) భారత్, బంగ్లాదేశ్‌లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు (IND vs BAN) దుబాయ్ వేదిక కానుంది. కాగా.. వరుస విజయాలతో జోష్ మీదున్న భారత్‌ను ఓడిస్తామని బంగ్లాదేశ్ హెడ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ వ్యాఖ్యానించాడు. భారత్‌ను ఓడించడం అసాధ్యం ఏమీ కాదన్నారు. మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిమ్మన్స్ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.
‘భారత్‌ను ఓడించడం అసాధ్యం అయితే కాదు. ప్రతి జట్టుకు కూడా టీమ్ఇండియాను ఓడించే సత్తా ఉంది. మ్యాచ్ జరిగే రోజు మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన చేసే జట్టే గెలుస్తుంది. అంతేగానీ గత రికార్డుల ఆధారంగా విజేతలను నిర్ణయించలేము.’ అని సిమ్మన్స్ అన్నాడు.
Sri Lanka : పాక్ చేతిలో ఓటమి.. శ్రీలంక ఫైనల్ చేరాలంటే..?
మ్యాచ్ ఆడే సమయంలో ఆ మూడున్నర గంటల్లో ఎలా ఆడతారో అన్న దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చాడు. తాము అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. టీమ్ఇండియా ప్రపంచ నంబర్1 జట్టు అని అన్నాడు. ఆ టీమ్‌తో ఆడేటప్పుడు ఖచ్చితంగా ఒక హైప్ ఉంటుందన్నాడు. దీన్ని బంగ్లాదేశ్ ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోవాలన్నాడు.
తమ జట్టులో నాణ్యమైన బౌలర్లు ఉన్నారన్నాడు. వారు ఖచ్చితంగా భారత బ్యాటర్లను ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పుకొచ్చాడు. గత మ్యాచ్‌ల్లో తాము కొన్ని పొరపాట్లు చేసినట్లుగా అంగీకరించాడు. అయితే.. వాటిని సరిదిద్దుకుని టీమ్ఇండియాను ఓడించేందుకు ప్రయత్నిస్తాం అని తెలిపాడు. గత మ్యాచ్‌ల రికార్డుల గురించి తాము పట్టించుకోమని, అత్యుత్తమ ప్రదర్శన చేయడం పై మాత్రమే దృష్టిసారిస్తామన్నాడు.