IND vs PAK Asia Cup 2025
IND vs PAK Asia Cup 2025: ఆసియా కప్ టోర్నీలో భాగంగా వారం రోజుల వ్యవధిలోనే మళ్లీ చిరకాల ప్రత్యర్థులైన భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య పోరును చూడబోతున్నాం. ఇవాళ (ఆదివారం) రాత్రి 8గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. గ్రూప్ దశ మ్యాచ్‌లో అన్నివిభాగాల్లో అధిపత్యం చలాయిస్తూ పాకిస్థాన్ జట్టును చిత్తుచేసిన టీమిండియా.. ఇవాళ జరిగే సూపర్-4 మ్యాచ్‌లోనూ పాక్ జట్టును ఓడించాలని ఉవ్విళ్లూరుతోంది.
గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌లో పాక్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. దీంతో తదనంతరం జరిగిన పరిణామాల్లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్ర అసంతృప్తిని ప్రదర్శించింది.. తద్వారా ఈ వ్యవహారం వివాదానికి దారితీయడం జరిగింది. నో షేక్ హ్యాండ్ వివాదం తరువాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ పై క్రీడాభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచింది.
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య పోరు అంటే సహజంగానే ఆసక్తిని రేపుతోంది. లీగ్ దశలో పాక్ ఆటతీరు చూస్తే టీమిండియాకు మళ్లీ ఎదురు ఉండకపోవచ్చు. దుబాయ్ లో రికార్డు, పరిస్థితి బట్టి చూస్తే టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. మరోవైపు.. నో షేక్ హ్యాండ్ వివాదం తరువాత.. పాకిస్థాన్ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఐసీసీ ఈ మ్యాచ్ కు కూడా ఆండీ పైక్రాఫ్ట్‌నే రిఫరీగా ఎంపిక చేయడం విశేషం.
ఇవాళ పాకిస్థాన్ జట్టుతో జరిగే మ్యాచ్ లో భారత తుది జట్టులో రెండు మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్ సమయంలో ఫీల్డింగ్ చేస్తుండగా టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తలకు గాయమైంది. ఈ క్రమంలో పాక్‌తో మ్యాచ్‌కు అక్షర్ పటేల్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు.. దూబే స్థానంలో మరో బ్యాటర్‌ను బరిలోకి దింపే అవకాశాలు లేకపోలేదు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో భారత జట్టు పటిష్ఠంగా ఉంది. బౌలింగ్ విభాగంలో జస్ర్పీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ అదరగొడుతున్నారు. అయితే, ఒకవేళ అక్షర్ పటేల్ మ్యాచ్ కు దూరమైతే అతని స్థానంలో ఎవరిని బరిలోకి దింపుతారనే అంశం ఆసక్తికరంగా మారింది.