Asia Cup 2025
Asia Cup 2025 : ఆసియా కప్ 2025 టోర్నీలో భారత జట్టు అద్భుత ప్రదర్శన ఇస్తోంది. గ్రూప్-ఎ లో ఉన్న టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్‌లో యూఈ, పాకిస్థాన్ జట్లతో జరిగిన మ్యాచ్‌లలో విజయం సాధించిన భారత జట్టు.. తన తదుపరి మ్యాచ్‌ను ఒమన్ జట్టుతో ఆడనుంది. శుక్రవారం (సెప్టెంబర్ 19)న రాత్రి ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే, ఈ మ్యాచ్‌లో ముగ్గురు ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చేందుకు టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలిసింది.
Also Read: Rashid Khan : చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. భువనేశ్వర్ కుమార్ ప్రపంచ రికార్డు బద్దలు..
ఆసియా కప్-2025 టీ20 టోర్నీలో గ్రూప్-ఎ నుంచి ఇప్పటికే సూపర్-4 బెర్తును ఖాయం చేసుకున్న భారత్ జట్టు.. ఒమన్ జట్టుతో నామమాత్రమైన చివరి లీగ్ మ్యాచ్‌ను శుక్రవారం ఆడనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముగ్గురు టీమిండియా ప్లేయర్లు దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. ప్రధాన పేసర్ జస్ర్పీత్ బుమ్రాతోపాటు.. హార్ధిక్ పాండ్యా, సంజు శాంసన్స్ లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం.
టీమిండియా ప్రధాన బౌలర్ జస్ర్పీత్ బుమ్రాకు ఒమన్ తో జరిగే మ్యాచ్ లో విశ్రాంతి ఇవ్వనున్నారట. అతడి స్థానంలో హర్షిత్ రాణా లేదా అర్ష్‌దీప్ సింగ్‌లలో ఒకరిని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే, అర్ష్‌దీప్ సింగ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో తిరిగి వచ్చి భారత పేస్ అటాక్‌కు మరోసారి నాయకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అతను టీ20లలో 99 వికెట్లు పడగొట్టాడు.
టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకు కూడా ఒమన్‌తో మ్యాచ్‌లో విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. గడిచిన రెండు మ్యాచ్‌లలో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. రెండు మ్యాచ్‌లలో సెకండ్ పేసర్‌గా హార్దిక్ కొనసాగాడు. హార్దిక్ విశ్రాంతినిస్తే.. బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ తుది జట్టులోకి వచ్చినా.. హార్దిక్ స్థానంలో హర్షిత్ రాణా తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్స్‌కు కూడా ఒమన్ జట్టుతో మ్యాచ్ లో విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. సంజూ శాంసన్స్ తుదిజట్టుకు దూరమైతే అతని స్థానంలో జితేశ్ శర్మకు అవకాశం లభించే చాన్స్ ఉంది.
ఆసియా కప్-2025 టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడి రెండింటిలో విజయం సాధించిన భారత జట్టు సూపర్-4కు చేరుకుంది. శుక్రవారం ఒమన్ జట్టుతో గ్రూప్ స్టేజ్‌లో తన చివరి మ్యాచ్ టీమిండియా ఆడనుంది. సూపర్ -4లో భారత్ తన తొలి మ్యాచ్ ను ఆదివారం ఆడుతుంది. ఈనెల 24, 26 తేదీల్లో తరువాతి మ్యాచ్‌లు ఉంటాయి. ఫైనల్ మ్యాచ్ 28వ తేదీన జరుగుతుంది.