Asia cup 2025 Jaker Ali comments after Bangladesh lost match to India
Jaker Ali : ఆసియాకప్ 2025లో భారత్ వరుస విజయాలతో ఫైనల్‌లో అడుగుపెట్టింది. బుధవారం బంగ్లాదేశ్ పై 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా.. బ్యాటింగ్ ఆర్డర్‌లో వైఫల్యం వల్లే తాము ఈ మ్యాచ్‌లో ఓడిపోయామని బంగ్లాదేశ్ కెప్టెన్ జాకీర్ అలీ అన్నాడు. నేడు (గురువారం సెప్టెంబర్ 25న) పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంటామనే ధీమాను వ్యక్తం చేశాడు.
మ్యాచ్ అనంతరం జాకీర్ అలీ మాట్లాడుతూ.. తమ బౌలర్లు అసాధారణ ప్రదర్శన చేశారన్నాడు. దీంతో టీమ్ఇండియాను తక్కువ స్కోరుకే పరిమితం చేశామన్నాడు. ఈ క్రెడిట్ అంతా కుర్రాళ్లదేనని చెప్పుకొచ్చాడు. మొదటి 10 ఓవర్ల తరువాత తమ బౌలర్లు అద్భుతంగా రాణించారన్నాడు. ఇక ఈ మ్యాచ్ నుంచి తాము చాలా విషయాలను నేర్చుకున్నట్లుగా తెలిపాడు.
గురువారం పాక్‌తో మ్యాచ్ ఉందని, ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఫైనల్‌కు చేరుకుంటామని తెలిపాడు. పాక్‌తో మ్యాచ్‌లో ఏ కాంబినేషన్‌లో దిగితే బాగుంటుందనే విషయాలపై ఫోకస్ చేసినట్లుగా వెల్లడించాడు. బ్యాటర్ల వైఫల్యం కారణంగానే భారత్‌తో మ్యాచ్‌లో ఓడిపోయినట్లుగా తెలిపాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో అభిషేక్ శర్మ (75; 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచికొట్టాడు. హార్దిక్ పాండ్యా (29 బంతుల్లో 38 పరుగులు ), శుభ్‌మన్ గిల్ (19 బంతుల్లో 29 పరుగులు) లు రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హుస్సేన్ రెండు వికెట్లు తీయగా, తంజిమ్ హసన్, ముస్తాఫిజుర్, సైఫుద్దీన్ లు తలా ఓ వికెట్ సాధించారు.
Vaibhav Suryavanshi : చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. యూత్ వన్డేల్లో సిక్సర్ల కింగ్..
ఆ తరువాత సైఫ్ హసన్ (69; 51 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించినప్పటికి కూడా 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. టీమ్ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా, వరున్ చక్రవర్తిలు చెరో రెండు వికెట్లు సాధించారు. అక్షర్ పటేల్, తిలక్ వర్మలు చెరో వికెట్ పడగొట్టారు.