AUS vs ENG 3rd Test Mitchell Starc has backed Nathan Lyon to go through another rehab
AUS vs ENG : మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా జట్టు ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2025-26 కైవసం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కూడా విజయం సాధించి 5-0 తేడాతో ఇంగ్లాండ్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని ఆస్ట్రేలియా ఆరాటపడుతోంది. అయితే.. గెలుపు జోష్‌లో ఉన్న ఆసీస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ చివరి రెండు మ్యాచ్‌లకు దూరం అయినట్లు తెలుస్తోంది.
అడిలైడ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ చివరి రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తుండగా నాథన్ లియోన్ గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో డైవ్ చేసిన తరువాత అతడి తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విలవిలలాడాడు. వెంటనే ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికి కూడా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఫిజియో సాయంతో అతడు మైదానాన్ని వీడాడు.
ఇక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచిన తరువాత అతడు ఊత కర్రల సాయంతో మైదానంలో నడుస్తూ కనిపించాడు. దీంతో అతడి గాయం చాలా తీవ్రమైనదిగా తెలుస్తోంది.
రిహాబిలిటేషన్ సెంటర్‌కు లియోన్..
38 ఏళ్ల నాథన్ లియోన్ గాయం పై ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ స్పందించాడు. ఇది నిజంగా చాలా బాధకరం అని చెప్పుకొచ్చాడు. ఇక మూడో టెస్టు విజయంలో అతడు కీలక పాత్ర పోషించాడని, ఖచ్చితంగా అతడికి క్రెడిట్ ఇవ్వాల్సిందేనని అన్నాడు. ఇక లియోన్ తిరిగి రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లనున్నాడని చెప్పాడు.
‘ఇక గతంలో కూడా పిక్క గాయంతో బాధపడిన సమయంలో రిహాబిలిటేషన్‌లో అతడు కోలుకున్నాడు. ఇప్పుడు కూడా అతడి ఖచ్చితంగా త్వరగానే కోలుకుంటాడు. ఆసీస్ జట్టుకు మరికొన్నాళ్ల పాటు అతడు తన సేవలను అందించాలని అనుకుంటున్నాడు. త్వరలోనే అతడు మైదానంలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నాను.’ అని మిచెల్ స్టార్క్ అన్నాడు.
అడిలైడ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో లియోన్ 5 వికెట్లు తీసి గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు.