Australia A pacer Henry Thornton Hospitalised In Kanpur
Henry Thornton : ఆస్ట్రేలియా-ఏ జట్టుకు చెందిన పేసర్ హెన్రీ థోర్న్టన్ కాన్పూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరాడు. భారత్ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా-ఏ జట్టుతో ఉన్న అతడు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డాడు. వెంటనే అతడిని (Henry Thornton) కాన్పూర్‌లోని రీజెన్సీ ఆస్పత్రిలో చేర్పించారు. అతడికి పుడ్ పాయిజన్ అయినట్లు సమాచారం.
జట్టు బస చేస్తున్న హోటల్‌లో ఆహారం తిన్న తర్వాత అతడికి ఉదర సంబంధిత సమస్యలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. తొలుత ఆసీస్ టీమ్ మేనేజ్‌మెంట్ అతడికి ప్రాథమిక చికిత్స అందించింది. ఆ తర్వాత ఆస్పత్రిలో చేర్చారు. సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో అతడికి చికిత్స కొనసాగుతుంది.
వాస్తవానికి అతడు కాన్పూర్ రావడానికి ముందే గ్యాస్ట్రో లక్షణాలతో బాధపడుతున్నట్లు టీమ్ మేనేజర్ తెలిపాడు. ఈ ఘటన నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు తమ భోజన ప్రణాళికల్లో మార్పులు చేసింది. హెన్రీ థోర్న్టన్ మాత్రమే కాకుండా మరో ముగ్గురు ఆటగాళ్లు ఉదర సంబంధిత సమస్యతో బాధపడ్డారని, అయితే.. వాళ్లను ఆస్పత్రిలో చేర్చేంత పెద్ద సమస్య కాదని సమాచారం.
ఆస్ట్రేలియా-ఏ, భారత్-ఏ మధ్య కాన్పూర్ వేదికగా అనధికారిక రెండో వన్డే మ్యాచ్ శుక్రవారం (అక్టోబర్ 3న) జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్-ఏ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (1), అభిషేక్ శర్మ (0), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (8) విఫలమైనా కూడా తిలక్ వర్మ (94), రియాన్ పరాగ్ (58)లు రాణించడంతో భారత్ 45.5 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది.
247 పరుగుల లక్ష్యంతో ఆసీస్ బరిలోకి దిగింది. 5.5ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది. మూడు గంటల సమయం కోల్పోవడంతో డక్‌వర్త్‌లూయిస్ పద్దతిలో ఆసీస్ లక్ష్యాన్ని 25 ఓవర్లలో 160 పరుగులుగా నిర్ణయించారు. జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ (36), మెకెంజీ హార్వే(70నాటౌట్), కూపర్ కొన్నోలీ (50 నాటౌట్) రాణించడంతో లక్ష్యాన్ని ఆసీస్ 16.4 ఓవర్లలో వికెట్ కోల్పోయి అందుకుంది. ఆస్నత్రిలో చేరడంతో హెన్రీ థోర్న్టన్ ఈ మ్యాచ్‌లో ఆడలేదు.
ఈ విజయంతో ఆసీస్-ఏ మూడు వన్డేల అనధికారిక వన్డే సిరీస్ 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మకమైన మూడో అనధికారిక వన్డే మ్యాచ్ అక్టోబర్ 5న ఆదివారం జరగనుంది.