Australia Win by 7 wickets against India in First ODI
IND vs AUS : పెర్త్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 131 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 21.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి ఛేదించింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (46 నాటౌట్; 52 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జోష్ ఫిలిప్ (37; 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు)లు రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లు తలా ఓ వికెట్ తీశారు.
131 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్‌కు ఆదిలోనే షాకులు తగిలాయి. 8 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్‌ను అర్ష్‌దీప్ సింగ్ ఔట్ చేయగా, మాథ్యూషాట్ (8) అక్షర్ పటేల్ వెనక్కి పంపించడంతో ఆసీస్ 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో మిచెల్ మార్ష్, జోష్ ఫిలిప్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతలను భుజాన వేసుకున్నారు.
వీరిద్దరు తొలుత ఆచితూచి ఆడారు. కుదురుకున్నాక భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరు మూడో వికెట్ కు 55 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని ఫిలిప్‌ను ఔట్ చేయడం ద్వారా వాషింగ్టన్ సుందర్ విడగొట్టాడు. ఫిలిప్ ఔటైనా మాట్ రెన్షా(21 నాటౌట్)తో కలిసి మిచెల్ మార్ష్ జట్టును విజయతీరాలకు చేర్చాడు.
అంతకముందు ఈ మ్యాచ్‌లో ముందుగా భారత బ్యాటింగ్ చేసింది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో 26 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు. నిర్ణీత ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్ (31) లు రాణించారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్, వోవెన్, కునెమన్ తలా రెండు వికెట్లు తీశారు. స్టార్క్, ఎలిస్ చెరో వికెట్ సాధించారు. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఆసీస్ లక్ష్యాన్ని 131గా నిర్ధారించారు.