“గౌరవించే తీరు ఇదేనా?”.. స్టేడియంలో పెవిలియన్ నుంచి తన పేరు తొలగింపు ఆదేశాలపై అజారుద్దీన్
హైదరాబాద్‌లో క్రికెటర్లను గౌరవించే తీరు ఇదేనా అని నిలదీశారు.

హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నార్త్ స్టాండ్ పెవిలియన్ నుంచి మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ పేరును తొలగించాలని హెచ్‌సీఏకి అంబుడ్స్‌మన్ జస్జిస్ ఈశ్వరయ్య ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై అజారుద్దీన్ స్పందించారు.
ఇందులో ఎటువంటి కుట్రకోణం లేదని అజారుద్దీన్ అన్నారు. తాను ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్య చేయబోనని, ఆ స్థాయికి దిగజారబోనని తెలిపారు. హెచ్‌సీఏను చూసి క్రికెట్ ప్రపంచం నవ్వుకుంటోందని చెప్పారు. తాను 17 ఏళ్ల పాటు క్రికెట్‌లో ఉన్నానని, 10 ఏళ్లు టీమిండియా కెప్టెన్‌గా ఉన్నానని అన్నారు.
Also Read: ధనాధనా 73 రన్స్ బాదిన కోహ్లీ.. ఆర్సీబీ ఘనవిజయం
తాను కెప్టెన్‌గా డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణుడినయ్యానని అజారుద్దీన్ తెలిపారు. హైదరాబాద్‌లో క్రికెటర్లను గౌరవించే తీరు ఇదేనా అని నిలదీశారు. ఈ తీరు బాధాకరమని, కచ్చితంగా న్యాయస్థానానికి వెళ్తామని అన్నారు. తమకు 100 శాతం న్యాయం జరుగుతుందని చెప్పారు.
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలోని నార్త్ స్టాండ్ పెవిలియన్ నుంచి మహ్మద్ అజారుద్దీన్ పేరు ఉండడంపై లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్ పై అంబుడ్స్‌మన్ విచారణ జరిపి.. దాన్ని తొలగించాలంటూ శనివారం హెచ్‌సీఏకు ఆదేశించారు.
హెచ్‌ఏసీ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో అజారుద్దీన్ తన పేరు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నారని అంబుడ్స్‌మన్ చెప్పారు. దీంతో ఈ నిర్ణయం చెల్లదని తెలిపారు. అజారుద్దీన్ తీసుకున్న నిర్ణయంలో విరుద్ధ ప్రయోజనాలున్నాయని తీర్పు ఇచ్చారు. అలాగే, టికెట్లపై ఇకపై ఆ పేరు ప్రస్థావన ఉండొద్దని చెప్పారు.