BBL 2025 Sydney Thunder vs Perth Scorchers Ashton Turner 99 Not out
BBL : క్రికెట్‌లో అప్పుడప్పుడూ కొన్ని ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటాయి. తాజాగా బిగ్‌బాష్ లీగ్ 2025-26 సీజన్‌లో అలాంటి ఓ సంఘటన చోటు చేసుకుంది. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 99 పరుగులకు చేరుకున్న బ్యాటర్ తన సహచరుడి కారణంగా సెంచరీ చేసే ఛాన్స్‌ను కోల్పోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
బిగ్‌బాష్ లీగ్‌లో (BBL) భాగంగా మంగళవారం సిడ్నీ థండర్, పెర్త్ స్కార్చర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పెర్త్ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు సాధించింది. పెర్త్ బ్యాటర్లలో కెప్టెన్ ఆష్టన్ టర్నర్ (99; 41 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తృటిలో శతకాన్ని చేసే అవకాశాన్ని కోల్పోయాడు. కూపర్ కానలీ(28), ఆరోన్ హార్డీ (28) లు ఫర్వాలేదనింపించారు. సిడ్నీ బౌలర్లలో డేనియల్ సామ్స్ నాలుగు వికెట్లు తీశాడు. రీస్ టోప్లీ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు కావాల్సి ఉండగా..
పెర్త్ ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లు ముగిసే సరికి ఆష్టన్ టర్నర్ 86 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు చేస్తే అతడు సెంచరీ పూర్తి చేసుకుంటాడు. అదృష్టం కొద్ది అతడే స్ట్రైకింగ్. ఆఖరి ఓవర్‌ను డేనియల్ సామ్స్ వేశాడు. తొలి రెండు బంతులను టర్నర్ సిక్సర్లుగా మలిచాడు. దీంతో టర్నర్ వ్యక్తిగత స్కోరు 98 పరుగులకు చేరుకుంది.
Four balls left. Ashton Turner on 98.
What happens next is rough… #BBL15 pic.twitter.com/vbdr2ZIOOz
— KFC Big Bash League (@BBL) December 30, 2025
మరో నాలుగు బంతులు ఉండడంతో అతడు ఈజీగా సెంచరీ చేస్తాడని అనిపించింది. అయితే.. మూడో బంతికి అతడు సింగిల్ తీశాడు. నాలుగో బంతికి స్ట్రైకింగ్‌కు వచ్చిన ఆష్టన్ అగర్ సింగిల్ తీసి టర్నర్ కు ఇస్తాడని అంతా భావించారు. అయితే.. అగర్ మాత్రం ఫోర్ కొట్టాడు. పోనీ ఐదో బంతికి అయిన అగర్ సింగిల్ తీసి ఇస్తే చివరి బంతికి టర్నర్ సెంచరీ చేసుకుంటాడు లే అని అనుకుంటే ఇక్కడే పెద్ద ట్విస్ట్ వచ్చింది. ఐదో బంతికి అగర్ క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో టర్నర్ నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో మిగిలి పోవాల్సి వచ్చింది. చివరి బంతిని ఆడిన జోయెల్ పారిస్ కూడా ఔట్ అయ్యాడు.
సెంచరీ మిస్ అయినా..
ఈ మ్యాచ్‌లో టర్నర్ సెంచరీ మిస్ అయినప్పటికి కూడా అతడు నాయకత్వం వహించిన పెర్త్ జట్టు గెలిచింది. 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ జట్టు 17.3 ఓవర్లలో 131 పరుగులకు కుప్పకూలింది. దీంతో పెర్త్ 71 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.