Aman Khan : సీఎస్‌కే ఆల్‌రౌండర్ సత్తా చూశారా? 10 ఓవర్లలో 123 పరుగులు.. షాక్‌లో చెన్నై ఫ్యాన్స్.. ఇలా అయితే..
ఐపీఎల్ మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ 40 లక్షలు వెచ్చించి ఆల్‌రౌండర్ అమన్ ఖాన్ (Aman Khan) ను కొనుగోలు చేసింది.
Aman Khan Leaks World Record 123 In 10 Overs In Vijay Hazare Trophy
Aman Khan : ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలం 2025లో ఫ్రాంఛైజీలు అన్ని తమకు కావాల్సిన ప్లేయర్లను కొనుగోలు చేశాయి. ఇందులో స్టార్ ఆటగాళ్లతో పాటు అన్‌క్యాప్డ్ ఆటగాళ్ల పై ఫ్రాంఛైజీలు కోట్ల వర్షం కురిపించాయి. స్టార్ ప్లేయర్ల ఆటతీరుపై క్రికెట్ ఫ్యాన్స్‌కు మంచి అవగాహనే ఉన్నప్పటికి కూడా అన్‌క్యాప్డ్ ఆటగాళ్ల ఎలా ఆడతారు అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో దేశవాళీ వన్డే టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో ఫ్రాంఛైజీలు కొనుగోలు చేసిన అన్‌క్యాప్డ్ ఆటగాళ్ల ప్రదర్శనపై అభిమానులు దృష్టి సారించారు.
ఐపీఎల్ మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ 40 లక్షలు వెచ్చించి ఆల్‌రౌండర్ అమన్ ఖాన్ ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం అతడు వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే.. అతడు వార్తల్లో నిలిచింది తన అద్భుతమైన ఆటతీరుతో కాదు. ఓ చెత్త రికార్డు కారణంగా. పుదుచ్చేరి కెప్టెన్ అయిన అమన్ ఖాన్ సోమవారం జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పది ఓవర్లు వేసి ఏకంగా 123 పరుగులు సమర్పించుకున్నాడు.
దేశవాళీ, అంతర్జాతీయ వన్డేలు కలిపి (లిస్ట్–ఎ క్రికెట్)లో ఓ మ్యాచ్‌లో ఓ బౌలర్ ఇచ్చిన అత్యధిక పరుగులు ఇవే కావడం గమనార్హం. గతంలో ఈ రికార్డు మిబోమ్ మోసూ పేరిట ఉండేది. విజయ్ హజారే ట్రోఫీలోనే ఈ నెల 24న బిహార్‌తో జరిగిన మ్యాచ్‌లో అరుణాచల్‌ప్రదేశ్ బౌలర్ మిబోమ్ మోసూ 9 ఓవర్లు వేసి 116 పరుగులు ఇచ్చాడు. తాజాగా ఈ చెత్త రికార్డును అమన్ అధిగమించాడు.
ఈ ప్రదర్శనను చూసిన చెన్నై అభిమానులు షాక్ అవుతున్నారు. ఇతడిని సీఎస్‌కే ఎలా కొనుగోలు చేసిందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అమన్ ఖాన్ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో రెండు సీజన్ల పాటు కోల్‌కతా, ఢిల్లీ జట్లకు ఆడాడు. మొత్తం 12 మ్యాచ్‌లు ఆడాడు. కేవలం ఒకే ఒక ఓవర్ వేసే అవకాశం వచ్చింది. ఆ ఓవర్‌లో 13 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక 10 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌కు దిగి 115 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 51 పరుగులు.
