Shakib al Hasan : నీ కోరిక నెరవేర్చలేము.. బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్‌కు షాకిచ్చిన బీసీబీ
బంగ్లాదేశ్ లో చివరగా టెస్టు మ్యాచ్ ఆడతానని.. ఆ తరువాత కుటుంబంతో అమెరికాకు వెళ్లి ఎప్పటికీ స్వదేశానికి తిరిగిరానని కొత్త ప్రభుత్వానికి, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కు కూడా షకిబ్ లిఖితపూర్వకంగా లేఖ రాసినట్లు తెలుస్తోంది.

Shakib Al Hasan
BCB president Faruque Ahmed : బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ గురువారం తన రిటైర్మెంట్ ప్రణాళికను వెల్లడించారు. టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలికినట్లు ప్రకటించిన అతను.. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోపీతో వన్డే క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నట్లు తెలిపాడు. వచ్చే నెల సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్ లో ఆడలేకపోతే భారత్ తో రెండో టెస్టే కెరీర్ లో తన చివరి టెస్టు కావొచ్చని కూడా చెప్పాడు. అయితే, షకీబ్ బంగ్లాదేశ్ లో మర్డర్ కేసును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటీవల పదవీచిత్యురాలైన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నుంచి పోటీచేసిన షకీబ్ ఎంపీగా ఎన్నికయ్యాడు. ఇటీవల హసీనాకు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక నిరసనల సందర్భంగా జరిగిన ఓ హత్యకు సంబంధించి మరికొందరితో పాటు షకిబ్ పై కేసు నమోదైంది. అప్పటి నుంచి అతడు స్వదేశానికి వెళ్లట్లేదు.
బంగ్లాదేశ్ లో చివరగా టెస్టు మ్యాచ్ ఆడతానని.. ఆ తరువాత కుటుంబంతో అమెరికాకు వెళ్లి ఎప్పటికీ స్వదేశానికి తిరిగిరానని కొత్త ప్రభుత్వానికి, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కు కూడా షకిబ్ లిఖితపూర్వకంగా లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై బీసీబీ అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ స్పందించాడు. భారత్ లోని కాన్పూర్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో మిర్పూర్ లోని షేర్ -ఏ- బంగ్లా నేషనల్ స్టేడియంలో తన కెరీర్ లో చివరి టెస్టు ఆడాలని షకీబ్ ఆశించాడు. అనంతరం బీసీబీ బోర్డు సమావేశాన్ని నిర్వహించింది.
భద్రతా సమస్యలు మా చేతుల్లో లేదు. ఈ విషయంలో ఆయనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిపై బోర్డు మరింతగా వ్యాఖ్యానించలేదని ఫరూక్ అహ్మద్ స్పష్టం చేశాడు. బీసీబీ అనేది పోలీసు లేదా ర్యాపిడ్ యాక్షన్ బెలాటియన్ లాగా భద్రతా ఏజెన్సీ కాదు.. ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో భద్రతా సమస్యను పరిష్కరించాలని ఫరూక్ అన్నాడు. అతడి భద్రతకు బీసీబీ చేతుల్లో లేదని ఫరూక్ స్పష్టం చేశాడు. దీంతో షకీబ్ కు ప్రస్తుతం భారత్ జట్టుతో జరిగే టెస్టు మ్యాచ్ చివరి టెస్టు మ్యాచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.