Rahul Dravid: ద్రవిడ్‌, సపోర్ట్ స్టాఫ్ కాంట్రాక్టులను పొడిగించిన బీసీసీఐ

ముందు నుంచి అనుకున్నదే జరిగింది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ కొనసాగనున్నారు. ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది.

BCCI announces extension of contracts for Head Coach Rahul Dravid and Support Staf Team India

Team India Head Coach: టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించింది. ద్రవిడ్‌తో పాటు సపోర్ట్ స్టాఫ్ కాంట్రాక్టులను పొడిగించినట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల ముగిసిన ODI ప్రపంచ కప్ 2023తో ద్రవిడ్ కాంట్రాక్టు ముగిసింది. ఈ నేపథ్యంలో ద్రవిడ్ కాంట్రాక్టు పొడిగిస్తూ బీసీసీఐ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. అయితే ఎంతకాలం పొడిగించారనే విషయాన్ని బీసీసీఐ స్పష్టం చేయలేదు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ కొనసాగే అవకాశం ఉందని సమాచారం.

భారత పురుషుల క్రికెట్ జట్టును తీర్చిదిద్దడంలో ద్రవిడ్ కీలక పాత్ర పోషించారని బోర్డు ప్రశంసించింది. NCA హెడ్‌గా, స్టాండ్-ఇన్ హెడ్‌కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌ సేవలను కూడా బోర్డు మెచ్చుకుంది. భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడంలో ద్రవిడ్, లక్ష్మణ్ బాగా పనిచేశారని కితాబిచ్చింది. ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టడానికి రాహుల్ ద్రవిడ్‌ను మించిన వారు లేరని, అతడి నిబద్ధత అసమానమని బీసీసీఐ గౌరవ కార్యదర్శి జైషా వ్యాఖ్యానించారు.

టీమిండియా విజయాల్లో రాహుల్ ద్రవిడ్ మూలస్తంభంలా నిలిచారని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ అన్నారు. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా ద్రవిడ్ అందించిన సేవలు ఎంతో విలువైనవని పొగిడారు. అతడి వ్యూహాత్మక మార్గదర్శకత్వానికి టీమిండియా విజయాలే నిదర్శనమని పేర్కొన్నారు. ద్రవిడ్ ఆధ్వర్యంలో టీమిండియా భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బీసీసీఐ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ద్రవిడ్ అన్నారు. వన్డే ప్రపంచకప్ తర్వాత ఎదురయ్యే కొత్త సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Also Read: ఇషాన్.. ఎంత పనిచేశావ్.. టీమిండియా కొంపముంచిన అప్పీల్!

ట్రెండింగ్ వార్తలు