BCCI plan to sack Suryakumar Yadav as India T20I captain report
BCCI : ఆసియాకప్ 2025 (Asia Cup 2025) కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించిన సంగతి తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోనే భారత జట్టు ఈ మెగాటోర్నీలో బరిలోకి దిగనుంది.
అతడికి డిప్యూటీగా శుభ్‌మన్ గిల్ వ్యవహరించనున్నాడు. అయితే.. అందుతున్న వార్తల ప్రకారం గిల్ రాకతో టీ20 జట్టు కెప్టెన్ అయిన సూర్య స్థానానికి ముప్పు పొంచి ఉంది. త్వరలోనే అతడిని నాయకత్వ బాధ్యతల నుంచి తొలగించే అవకాశం ఉంది.
వేరువేరు ఫార్మాట్లకు వేరువేరు కెప్టెన్లు ఉండాలన్న ఫార్ములాకు గంభీర్ వ్యతిరేకం అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వన్డే జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉండగా, టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్, టెస్టు జట్టుకు శుభ్‌మన్ గిల్ లు నాయకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే టీ20, టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ వన్డేల్లో ఎంత కాలం కొనసాగుతాడో చెప్పలేని పరిస్థితి ఉంది. అతడి వయసు దృష్ట్యా కూడా అతి త్వరలోనే గిల్ చేతికి వన్డే పగ్గాలు ఇచ్చే అవకాశం ఉంది. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు దీనిపై ఓ స్పష్టత రానుంది.
ఇక మిగిలింది టీ20లు. సూర్యకుమార్ యాదవ్ కు వచ్చే నెలలో 35 ఏళ్లు నిండనున్నాయి. టీ20లు అంటే కుర్రాళ్ల ఆట అని అంటుంటారు. ఈ క్రమంలో గిల్‌కు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆసియా కప్‌కు జట్టు ఎంపిక సమావేశంలో ఈ విషయం పై చర్చలు జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. నివేదికల ప్రకారం ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లో టీమ్ఇండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న అక్షర్ పటేల్ కు కెప్టెన్సీ ఇచ్చే విషయంపై చర్చించారు. అయితే.. ఎక్కువ కాలం జట్టులో ఉండే ఆటగాడు అయితే మంచిదని భావించి గిల్ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం.
గిల్ వైస్ కెప్టెన్‌గా నియమితుడవ్వడంతో సూర్యకుమార్ యాదవ్ తన ఆటను మరింత మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని బీసీసీఐ స్పష్టమైన సందేశం పంపినట్లైంది. కెప్టెన్‌గా జట్టుకు విజయాలు అందిస్తున్న సూర్య.. బ్యాటర్‌గా విఫలం అవుతున్నాడు. చివరిసారిగా 2024 అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌పై అతడు టీ20లో అర్థశతకం సాధించాడు. ఆ తరువాత నుంచి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు.
ఆసియాకప్‌లో టీమ్ఇండియా పేలవ ప్రదర్శన చేసి, బ్యాటర్‌గా కూడా సూర్య రాణించకుంటే అతడిపై వేటు పడే అవకాశం ఉంది. గిల్ ను వెంటనే టీ20 కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది. అప్పుడు గిల్ సారథ్యంలోనే టీ20 ప్రపంచకప్ బరిలోకి భారత్ దిగే ఛాన్స్ ఉంది. అయితే.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే పొట్టి ప్రపంచకప్ ఉండడంతో అప్పటి వరకు సూర్యను కొనసాగించి ఆ తరువాత గిల్‌కు పూర్తి స్థాయిలో బాధ్యతలను అప్పగించే మరో ప్లాన్‌లోనూ బీసీసీఐ ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఆసియాకప్ తరువాతనే సూర్య పై బీసీసీఐ ఓ నిర్ణయానికి రానుందని అంటున్నారు.