Jasprit Bumrah and Shreyas Iyer
World Cup 2023: మహేంద్ర సింగ్ ధోని సారధ్యంలో టీమ్ ఇండియా 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచింది. ఆ తరువాత ఇంత వరకు మరోసారి ప్రపంచకప్ ను ముద్దాడ లేదు. స్వదేశంలో ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో ఎలాగైనా ఈ సారి ప్రపంచకప్‌ను గెలవాలని భారత ఆటగాళ్లతో పాటు అభిమానులు కోరుకుంటున్నారు. అయితే కొందరు కీలక ఆటగాళ్లు గాయపడడం భారత జట్టును కలవరపెడుతోంది.
ఈ క్రమంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్‌ల గాయాల గురించి కీలక అప్‌డేట్ ఇచ్చింది. బుమ్రాకు నిర్వహించిన సర్జరీ విజవంతమైందని, అతడు త్వరలోనే ప్రాక్టీస్‌ను మొదలుపెట్టనున్నట్లు వెల్లడించింది. మరో ఆటగాడు శ్రేయాస్ అయ్యర్‌కు వచ్చేవారం శస్త్రచికిత్స జరగనున్నట్లు తెలిపింది. గాయాల కారణంగా వీరిద్దరు ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)2023 సీజన్‌లో ఆడడం లేదు. ఇక వీరిద్దరు వన్డే ప్రపంచకప్ నాటికి జట్టుతో కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌కు భారీ దెబ్బ.. ఐపీఎల్‌కు జస్ప్రీత్ బుమ్రా దూరం?
“న్యూజిలాండ్‌లో బుమ్రా వెన్నుముకకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. సర్జరీ విజయవంతమైంది. అతడు కోలుకున్నాడు. నిపుణుల సూచనల మేరకు అతడు ఆరు వారాల పాటు రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఉండనున్నాడు. శుక్రవారం నుంచి అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(NCA) పునరావాస నిర్వహణను ప్రారంభించాడు.” అని బీసీసీఐ తెలిపింది. ఇక ‘శ్రేయస్ అయ్యర్‌కు వచ్చే వారం శస్త్రచికిత్స జరగనుంది. సర్జరీ అనంతరం రెండు వారాల పాటు సర్జన్ సంరక్షణలో ఉంటాడు. ఆ తరువాత పునరావాసం కోసం ఎన్‌సీఏకి రానున్నట్లు’ ఓ ప్రకటనలో బీసీసీఐ తెలిపింది.
వెన్నునొప్పి కారణంగా సెప్టెంబర్ 2022 నుంచి బుమ్రా ఆటకు దూరం అయ్యాడు. ఆసియాకప్, టీ20 ప్రపంచకప్‌లకు అందుబాటులో లేకుండా పోయాడు. ఆయా టోర్నీలలో బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం బుమ్రా కోలుకున్నప్పటికీ జూన్‌లో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC Final) ఫైనల్ మ్యాచ్ ఆడతాడా..? లేదా అన్న దానిపైనే ఇంకా స్పష్టత రాలేదు. అయితే..అతడి విషయంలో తొందర పడకూడదని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోందట. ప్రపంచకప్ నాటికి బుమ్రా జట్టుతో చేరే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇక అయ్యర్ కూడా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం అయినా, ప్రపంచకప్ నాటికి అందులోకి వచ్చే ఛాన్సు కనిపిస్తోంది. వీరిద్దరు ప్రపంచకప్ నాటికి జట్టులో చేరితే భారత జట్టు మరింత పటిష్టం కానుంది.