ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 జరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ సూపర్ ఓవర్‌కు సంబంధించి కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. ఇటీవలే బీసీసీఐ ఐపీఎల్ కెప్టెన్ల సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఐపీఎల్ సూపర్ ఓవర్లలో స్వల్ప మార్పులు చేశారు.
ఐపీఎల్ మ్యాచులో డ్రా అయితే అనంతరం సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. సూపర్ ఓవర్లు ప్రత్యేకంగా ఒకటి, రెండు, అంతకంటే ఎక్కువ ఉండాలన్న నిబంధన ఏమీ ఉండదు. విజేత ఎవరో తేలేవరకు సూపర్ ఓవర్లు కొనసాగుతాయి.
Also Read: అడవిని కాపాడుతున్న లేడీ ఆఫీసర్ చిత్ర.. “పుష్ప”లాంటి వారిని ఎదుర్కొంటూ..
మొదటి సూపర్ ఓవర్‌ను ప్రధాన మ్యాచ్ ముగిసిన 10 నిమిషాల్లోనే ప్రారంభించాలి. మొదటి సూపర్ ఓవర్ టై అయితే, ఆ తరువాత 5 నిమిషాలకే మరో సూపర్ ఓవర్‌ను ప్రారంభించాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సూపర్ ఓవర్ మ్యాచ్ రిఫరీ నిర్ణయించిన సమయంలో జరగాలి.
సూపర్ ఓవర్లు ప్రారంభించిన గంటలోనే విజేత ఎవరో తేలిపోతుందని బీసీసీఐ భావిస్తోంది. అంతకు మించి సమయం తీసుకునే అవకాశం రాబోదని అనుకుంటోంది. అన్ని సూపర్ ఓవర్లలోనూ టై అవుతూ వెళ్తుంటే గంట సమయం దాటి పోతుందన్న విషయాన్ని కెప్టెన్లకు మ్యాచ్ రిఫరీ తెలపాలి.
అయితే, ఒకవేళ గంట సేపు సూపర్ ఓవర్లు ఆడినా మ్యాచ్ టై అయితే.. మ్యాచును డ్రా గా ప్రకటిస్తారు. ఇరు జట్లకు ఒక్కో పాయింట్ చొప్పున ఇస్తారు. సూపర్ ఓవర్‌లో ప్రతి జట్టు ఆరు బంతుల ఓవర్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
జట్టు ఎన్ని వికెట్లు కోల్పోయినా సంబంధం ఉండదు. ఎక్కువ పరుగులు చేసిన జట్టు విజేతగా నిలుస్తుంది. ఏదైనా టీమ్ ఒక ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోతే, వారి సూపర్ ఓవర్ ఇన్నింగ్స్ ముగుస్తుంది.