Inspirational Story: అడవిని కాపాడుతున్న లేడీ ఆఫీసర్ చిత్ర.. “పుష్ప”లాంటి వారిని ఎదుర్కొంటూ..
"ఎర్రచందనం స్మగ్లర్లు అడవుల్లో తిరుగుతుంటారు. వారు రాళ్లు, ఆయుధాలతో మాపై దాడి చేసేందుకు వెనుకాడరు" అని ఆమె తెలిపారు.

ఇటీవల శేషాచల అరణ్యంలో లోపలికి ప్రవేశించగానే ఏనుగుల గుంపు చాలా కోపంతో అరుస్తూ… మూడు వైపులా చుట్టుముట్టింది.. దాంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు తిరుపతి జిల్లా భీమవరంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న చిత్ర. అడవిలో క్రూర మృగాలను రక్షించడంతో పాటు వాటి నుంచి తప్పించుకునే సామర్థ్యం, తెలివి ఉంటేనే ఫారెస్ట్‌లో పనిచేయగలం.
ఇలాంటి ప్రమాదకరమైన సంఘటనలు అడవిలో పనిచేసే సిబ్బందికి నిత్యకృత్యం. ఆంధ్రప్రదేశ్ అడవులను రక్షించడంలో చిత్ర చూపిస్తున్న ధైర్యసాహసాలు అన్నీ ఇన్నీ కాదు. తన ప్రయాణాన్ని మలుపు తిరిగిన క్షణాలను గుర్తుచేసుకుంటూ.. అలాగే జీవితంలో ఎదురైన అనుభవాలను తాజాగా మీడియాతో చిత్ర ఇలా పంచుకుంది.
“మాది తిరుపతి. మా తల్లిదండ్రులు పశుపోషణతో జీవనం సాగించారు. ఎక్కువ చదువుకోలేకపోయాను. 1998లో చిత్తూరు జిల్లాకు చెందిన మధు శేఖర్‌ని వివాహం చేసుకున్నాను.
ఆర్థిక ఇబ్బందులతో ముగ్గురు కుమార్తెలను పెంచడం పెద్ద సవాల్‌గా తయారయ్యింది. నా పిల్లలు నాలాగా చదువుకోకుండా ఉండకూడదని గట్టిగా కోరుకునేదాన్ని. ఆ కొరికే నన్ను చదువుకునే దిశగా నడిపించింది. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ నుండి దూర విద్య ద్వారా డిగ్రీ పూర్తి చేశాను. ఆ తర్వాత ఐటీఐ కూడా పూర్తిచేశాను” అని చెప్పారు.
చాలాసార్లు ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు విఫలమైనా, చిత్ర ధైర్యాన్ని కోల్పోలేదు. “ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు, చివరి ఆశతో దరఖాస్తు చేసుకున్నాను. పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఉద్యోగం పొందాను” అని ఆమె చెప్పారు.
అయితే, ఈ ఉద్యోగం ఆమెకు ఎన్నో ఊహించని అనుభవాలను తెచ్చిపెడుతోంది. “ఇది ఆఫీస్ ఉద్యోగమనే అనుకున్నా. కానీ ఉద్యోగంలో చేరిన తర్వాత అడవిలో నివసించి, ఒంటరిగా పహరా కాయాలని తెలిసింది. అప్పట్లో భయమేసేది. కానీ, అటవీ సంరక్షణలో నా పాత్రను గుర్తించుకున్నప్పుడు గర్వంగా అనిపించింది. ఎంత మందికి అడవిని కాపాడే అవకాశం వస్తుందో చెప్పండి” అని చిత్ర అన్నారు.
ఉద్యోగంలో చేరిన మూడేళ్ల తర్వాత ఆమె జీవితంలో మరో విషాదం చోటుచేసుకుంది. భర్త మృతి చెందడంతో కుటుంబ భారం మొత్తం ఆమె మీదే పడింది. బంధువులు ఎవ్వరూ సహాయం చేయకపోవడంతో, మొదటి, రెండవ కుమార్తెలను హాస్టల్‌లో చేర్పించి, చిన్నకూతురుని తన దగ్గరనే పెట్టుకుంది.
“అంత చిన్నదాన్ని ఒంటరిగా వదిలి అడవిలోకి వెళ్లేదాణ్ణి. చాలాసార్లు రాత్రి ఆలస్యంగా తిరిగి వచ్చే సమయానికి ఏడుస్తూ నిద్రపోతూ కనిపించేది” అని కన్నీటి గాథను పంచుకున్నారు.
ఈ కష్టనష్టాల నడుమ కూడా, చిత్ర తన బాధ్యత పట్ల నిబద్ధతను చూపారు. రోజూ 30 నుంచి 40 కిలోమీటర్లు నడచి, కొండలను ఎక్కి, నీటి ప్రవాహాలు దాటి, అడవిలో మృగాల భయంతో జీవించారు. “పులులు, ఏనుగులు… అన్నింటినీ ఎదుర్కొన్నాను. ఇటీవల ఒక ఏనుగుల గుంపు వెంబడించింది. ఒకవైపు కొలను, మరొకవైపు ఏనుగులు. అదృష్టవశాత్తూ, కొండ కనిపించడంతో ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నాం” అని అనుభవాన్ని పంచుకున్నారు.
కానీ, అడవిలో మృగాలే కాదు, స్మగ్లర్లతో మరెంతో పెద్ద ముప్పు పొంచి ఉంటుంది. “ఎర్రచందనం స్మగ్లర్లు అడవుల్లో తిరుగుతుంటారు. వారు రాళ్లతో కానీ, ఆయుధాలతో కానీ మాపై దాడి చేసేందుకు వెనుకాడరు,” అని ఆమె తెలిపారు.
అయినా, చిత్ర తన లక్ష్యం వైపు నిలకడగా ముందుకు సాగారు. మహిళలు ఏ పనినైనా నిబద్ధతతో చేపడితే, అసాధ్యం లేదు అనే నమ్మకం ఆమెను ముందుకు నడిపించింది. నేడు, ఆమె త్యాగాలు ఫలించాయి. పెద్ద కుమార్తె సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, రెండో కుమార్తె వైద్య విద్యను అభ్యసిస్తోంది, మూడో అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతోంది.