మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఎందుకంటే?
తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు నిర్మాణం గురించి సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పలు వివరాలు తెలిపిన విషయం తెలిసిందే.

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై బీఆర్ఎస్ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసి కోమటిరెడ్డిపై హరీశ్ రావు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు.
సభలో రోడ్ల అభివృద్ధిపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసత్యాలు చెప్పారని, చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. శాసన సభ ప్రశ్నోత్తరాల సమయంలో రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన ప్రశ్నకు సంబంధించి కోమటి రెడ్డి ఇచ్చిన సమాధానం సభను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని స్పీకర్ కు చెప్పారు.
బీఆర్ఎస్ పాలనలో సీఆర్ఎస్ నిధులు రాలేదని, నల్లగొండ నియోజకవర్గ రోడ్లకు నిధులు కేటాయించలేదని, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కు ఎస్క్రో అకౌంట్ తెరవలేదని కోమటి రెడ్డి ఇచ్చిన సమాధానం పూర్తిగా అవాస్తవమని అన్నారు. స్పీకర్ కు ఇందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించారు. వెంటనే కోమటి రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసును అనుమతించాలని కోరారు.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు నిర్మాణం గురించి సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పలు వివరాలు తెలిపిన విషయం తెలిసిందే. శాసనసభలో మాజీ మంత్రి హరీశ్ రావు అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన సమాధానమిచ్చారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇచ్చిన సమాధానంపై బీఆర్ఎస్ అభ్యంతరాలు తెలుపుతోంది.