BCCI update on Virat Kohli Rohit Sharma ODI future after Australia series
BCCI : అక్టోబర్ 19 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ప్రస్తుతం కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. వీరిద్దరు ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక అయ్యారు. అయితే.. . ఇటీవల వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ ను తప్పించారు. అదే సమయంలో ఆసీస్‌తో వన్డే సిరీసే అంతర్జాతీయ క్రికెట్‌లో రో-కో ద్వయానికి చివరి సిరీస్ అని ప్రచారం సాగుతోంది.
ఈ విషయం పై బీసీసీఐ (BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించాడు. ‘రిటైర్‌మెంట్ నిర్ణయం అనేది పూర్తి ఆటగాళ్లదేనని, ఇందులో బీసీసీఐ ఎలాంటి జోక్యం చేసుకోదని చెప్పాడు. వారిద్దరు జట్టులో ఉండడం అతి పెద్ద సానుకూలాంశం. వారిద్దరు గొప్ప బ్యాటర్లు. ఆసీస్‌ను వారి సొంత గడ్డపైనే ఓడిస్తామని భావిస్తున్నాను.’ అని శుక్లా అన్నారు.
ఇక రోహిత్, కోహ్లీలకు ఇదే చివరి సిరీస్ అనే ప్రచారం పై మాట్లాడుతూ.. అలాంటిదేమీ లేదన్నారు. ఈ విషయం గురించి మనం ఆలోచించకూడదన్నారు. రిటైర్‌మెంట్ నిర్ణయం అనేది పూర్తిగా ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయం అని చెప్పుకొచ్చారు. ఏదీ ఏమైనప్పటికి కూడా ఆసీస్ సిరీసే వారికి చివరిది అని చెప్పడం తప్పు అని అన్నారు.
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన టీమ్ఇండియా ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నాడు. 273 మ్యాచ్‌లు ఆడగా 268 ఇన్నింగ్స్‌ల్లో 48.76 సగటుతో 11,168 పరుగులు సాధించాడు. ఇందులో 32 శతకాలు, 58 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 264. వన్డేల్లో ఎవరికి సాధ్యం కానీ విధంగా మూడు సార్లు ద్విశతకాలు బాదాడు.
మరోవైపు అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. 302 మ్యాచ్‌లు ఆడగా 290 ఇన్నింగ్స్‌ల్లో 57.88 సగటుతో 14,181 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు, 74 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 183. వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డులకు ఎక్కాడు.