Ben Stokes comments on sledging ahead of 4th test against India
మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేటి నుంచి నాలుగో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ స్లెడ్జింగ్, స్లో ఓవర్‌పైన కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అటు భారత్, ఇటు ఇంగ్లాండ్ పోటాపోటీగా తలపడుతున్నాయని చెప్పారు. రెండు జట్లు కూడా నాణ్యమైన క్రికెట్ ఆడుతున్నాయన్నాడు. ఇక నాలుగో టెస్ట్ మ్యాచ్‌లోనూ దూకుడుగానే ఆడతామన్నాడు. తాము అదే పనిగా స్లెడ్జింగ్ చేయాలని అనుకోమని, అయితే.. ప్రత్యర్థి జట్టు స్లెడింగ్‌కు దిగితే తాము ఏ మాత్రం వెనక్కి తగ్గమని చెప్పాడు.
స్లో ఓవర్ రేటు గురించి మాట్లాడుతూ.. ఓవర్ రేటు విషయంలో తనకు ఎలాంటి ఆందోళన లేదన్నాడు. అయితే.. కావాలని చేశామని అనడం సరికాదన్నాడు. ఆసియాలో ఉన్నట్లు ఇక్కడా ఒకే రూల్స్ పెట్టడం సరికాదన్నాడు. అక్కడ 70 శాతం ఓవర్లను స్పిన్నర్లు వేస్తారని, అదే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ లలో పేసర్లు ఎక్కువగా బౌలింగ్ చేస్తారన్నాడు. స్పిన్నర్లు బౌలింగ్ పూర్తి చేసేందుకు తక్కువ సమయం తీసుకుంటారన్నాడు. అందుకనే స్లో ఓవర్ రేటుపై కామన్‌సెన్స్‌తో ఆలోచించాలన్నాడు. కాంటినెంటల్‌ను బట్టి నిబంధనల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నాడు.
నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు తగిన విశ్రాంతి దొరికిందన్నాడు. దీంతో ఉత్సాహంగా మ్యాచ్ సిద్ధమైనట్లు చెప్పాడు. నాలుగో టెస్ట్ కు వేదికైన మాంచెస్టర్‌లో క్రిస్‌వోక్స్‌కు అద్భుతమైన రికార్డు ఉందన్నాడు.
కాగా.. నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు తమ తుది జట్టును ప్రకటించింది.
ఇంగ్లాండ్ తుది జట్టు ఇదే..
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.