Bharat Arun Big Advice For Indian Bowlers Ahead Of England Tests
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూన్ 20 నుంచి 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కాబోతుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ భారత బౌలర్లకు కీలక సూచనలు చేశారు. పేసర్లు వేగంగా బంతులు వేయడం పై తమ దృష్టిని సారించొద్దన్నాడు. పిచ్ మీదే దృష్టి పెట్టాలన్నాడు. చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్లే ఓ బౌలర్‌కు ఎంతో కీలకం అని చెప్పాడు.
ఇంగ్లాండ్ పిచ్‌లపై టీమ్ఇండియా పేసర్లు చక్కని స్వింగ్ ను రాబడతారనే నమ్మకం తనకు ఉందన్నాడు. ఇంగ్లాండ్‌లోని పరిస్థితులకు త్వరగా అలవాటు పడి రిథమ్‌ను అందుకోవాలన్నాడు. ‘భారత యువ బౌలింగ్ దళానికి ఎంతో ప్రతిభ ఉంది. గెలవాలన్న కోరిక ఉంది. అయితే.. కాస్త ఓపికగా ఆడితే ఖచ్చితంగా ఇంగ్లాండ్‌కు షాక్ ఇవ్వగలరు.’ అని అరుణ్ చెప్పుకొచ్చాడు.
ఇంగ్లాండ్ పర్యటన ఎప్పుడూ ఓ సవాలే అని భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా తెలిపారు. అయినప్పటికి మన బౌలింగ్ దళంలో నిలకడ ఉందని, వాళ్లు ఖచ్చితంగా పిచ్ పరిస్థితులకు అనుగుణంగా తమను తాము సిద్ధం చేసుకుంటారని చెప్పాడు.
ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన భారత జట్టులో పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, స్పినర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లకు మాత్రమే ఇంతకముందు ఇంగ్లాండ్‌లో ఆడిన అనుభవం ఉంది. వీరిలో బుమ్రా ఈ సిరీస్‌లో ఎన్ని మ్యాచ్‌ల్లో ఆడతాడో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇక ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్‌లు ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడడం కాస్త కలిసి వచ్చే అంశం. ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌లకు మాత్రం గతంలో ఇంగ్లాండ్‌లో ఆడిన అనుభవం లేదు. వారికి ఇదే తొలి ఇంగ్లాండ్ పర్యటన.