Big Bash League : బిగ్ బాష్ లీగ్‌ -2026 షెడ్యూల్ వచ్చేసింది.. భారత్‌లోనే సీజన్ ప్రారంభం.. చెన్నైలో క్రికెట్ పండుగ

Big Bash League 2026 Schedule : బిగ్ బాష్ లీగ్ (BBL) 2026-27 పూర్తి షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసింది. తొలి మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుంది.

BBL 2026 Schedule

Big Bash League 2026 Schedule : ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాష్ లీగ్ (BBL) 2026-27 పూర్తి షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసింది. అయితే, తొలిసారిగా బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ ఆస్ట్రేలియా వెలుపల భారత్‌లో జరగనుంది.

 

బిగ్ బాష్ లీగ్ 16వ సీజన్ తొలి మ్యాచ్ డిసెంబర్ 12న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనిగేడ్స్-పెర్త్ స్కోర్చర్స్ జట్లు తలపడనున్నాయి. బిగ్ బాష్ చరిత్రలో విదేశీ గడ్డపై నిర్వహిస్తున్న తొలి మ్యాచ్ ఇదే కావడం విశేషం.

చెన్నైలో ప్రారంభ మ్యాచ్ అనంతరం డిసెంబర్ 15 నుంచి ఆస్ట్రేలియాలో సాధారణ లీగ్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. తొలి మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్, సిడ్నీ సిక్సర్స్ జట్లతో గబ్బా వేదికగా తలపడనుంది. ఈ సీజన్‌లో మొత్తం 40 లీగ్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.


నాలుగేళ్ల విరామం తర్వాత క్రిస్మస్ ఈవ్ (డిసెంబర్ 24) రోజున మరో ప్రత్యేక మ్యాచ్ నిర్వహించనున్నారు. మెల్‌బోర్న్‌లోని జంక్షన్ ఓవల్ వేదికగా మెల్‌బోర్న్ రెనిగేడ్స్, హోబార్ట్ హరికేన్స్ జట్లు పోటీపడనున్నాయి.

ఈ సీజన్‌లో ‘డిజిగ్నేటెడ్ బ్యాటర్ అండ్ ఫీల్డర్’ అనే కొత్త నిబంధనను అమల్లోకి తీసుకురానున్నారు. దీని ప్రకారం ఒక ఆటగాడు కేవలం బ్యాటింగ్ మాత్రమే చేయవచ్చు. మరో ఆటగాడు కేవలం ఫీల్డింగ్ లేదా వికెట్ కీపింగ్ మాత్రమే చేయవచ్చు. దీంతో జట్ల వ్యూహాల్లో కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి.

భారత్‌లో బిగ్ బాష్ లీగ్ తొలి మ్యాచ్ నిర్వహించడం ద్వారా రెండు దేశాల మధ్య క్రీడా సహకారం మరింత బలోపేతం అవుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. ఈ చారిత్రక మ్యాచ్‌ను గత వారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Big Bash League 2026 Schedule