Lhuan-Dre Pretorius : బాబోయ్ కొట్టుడేకొట్టుడు..! టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా యువ ప్లేయర్..
Lhuan-Dre Pretorius : దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ లుహాన్-డ్రే ప్రిటోరియస్ పురుషుల టీ20 క్రికెట్లో సంచలనం సృష్టించాడు.
Lhuan-dre Pretorius
Lhuan-Dre Pretorius : దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ లుహాన్-డ్రే ప్రిటోరియస్ పురుషుల టీ20 క్రికెట్లో సంచలనం సృష్టించాడు. క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును బద్దలు కొట్టి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా దేశవాళీ CSA T20 ఛాలెంజ్ టోర్నీలో టైటాన్స్ జట్టు తరఫున ఆడిన ప్రిటోరియస్.. నైట్స్‌పై జరిగిన మ్యాచ్ లో విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టాడు.
లుహాన్-డ్రే కేవలం 79 బంతుల్లో అజేయ 188 పరుగులు చేశాడు. దీంతో టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్ గా అవతరించాడు. ఇదే క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట 13ఏళ్లుగా ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. క్రిస్ గేల్ 2013 ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున పుణె వారియర్స్ ఇండియాపై అజేయంగా 175 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆ రికార్డును లుహాన్-డ్రే బద్దలు కొట్టారు.
లుహాన్-డ్రే ప్రిటోరియస్ కేవలం 24 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.. మరో 20 బంతుల్లో అంటే.. 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఆ తరువాత 15 బంతులకే ఆఫ్ సెంచరీ పూర్తిచేసి.. 58 బంతుల్లో 150 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 79 బంతుల్లో 188 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. లుహాన్-డ్రే ప్రిటోరియస్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో టైటాన్స్ 20 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 267 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం నైట్స్‌ను 143 పరుగులకే ఆలౌట్ ((17.2 ఓవర్లలో 143) చేసి టైటాన్స్ 124 పరుగుల భారీ విజయం సాధించింది.
లుహాన్-డ్రే ప్రిటోరియస్ 79 బంతుల్లో 15 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 188 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని స్ట్రైక్‌రేట్ ఏకంగా 237.97గా నమోదైంది. ఈ ఇన్నింగ్స్‌లో ప్రిటోరియస్ మరో 12 పరుగులు చేసుంటే టీ20ల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ మరో చరిత్ర సృష్టించేవాడు.
