Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు ఇప్పటికే ముగిసింది. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ నాలుగు జట్లు టాప్-2లో నిలిచి ప్లేఆఫ్స్ ఆడేందుకు పోటీపడుతున్నాయి.
టాప్-2లో ప్లేఆఫ్స్‌లో అడుగుపెడితే ఏం జరుగుతుందంటే..?
పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న రెండు జట్లు క్వాలిఫయర్ 1లో తలపడుతాయి. అందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు తలపడుతాయి. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్ 2లో.. క్వాలిఫయర్ 1లో ఓడిపోయిన జట్టుతో తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ లెక్కన టాప్-2లో నిలిచిన జట్లకు ఫైనల్ చేరుకునేందుకు రెండు అవకాశాలు ఉంటాయి.
ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 13 మ్యాచ్‌లు ఆడగా 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 18 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉండగా నెట్‌రన్‌రేట్ +0.602గా ఉంది. లీగ్ దశలో మరో మ్యాచ్ (మే 25న చెన్నైతో) ఆడాల్సి ఉంది.
కాగా.. లక్నో చేతిలో ఓడిపోవడంతో లీగ్ దశ ముగిసే సరికి టాప్-2లో గుజరాత్ నిలిచే అవకాశాలు కాస్త కష్టమే. ఎందుకంటే.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (17 పాయింట్లు), మూడో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ (17 పాయింట్లు) లీగ్ దశలో చెరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
ఆయా మ్యాచ్‌ల్లో బెంగళూరు, పంజాబ్ లు గెలిస్తే అప్పుడు వాటి పాయింట్ల సంఖ్య 21కి చేరుకుంటుంది. గుజరాత్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై పై గెలిచినా అప్పుడు 20 పాయింట్లతో మూడో స్థానానికే పరిమితం అవుతుంది.
దీంతో ఆర్‌సీబీ లేదా పంజాబ్‌లు కనీసం ఒక్క మ్యాచ్‌లో ఓడిపోవాలని గుజరాత్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.