ఎనిమిదో తరగతి పిల్లాడు ఐపీఎల్‌లో ఆడొచ్చా? మరి సూర్యవంశీ ఎలా ఆడాడు?
భారత్‌లో 14 ఏళ్లలోపు పిల్లలతో ఫ్యాక్టరీల్లో, పరిశ్రమల్లో ఇతర ఏ ప్రదేశంలోనైనా పనులు చేయించుకుంటే బాల కార్మిక చట్టం కింద నేరం.

PIC: @BBCI
ఐపీఎల్ 2025లో శనివారం రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన 20 బంతుల్లో 34 పరుగులు బాదిన వైభవ్ సూర్యవంశీ (14) ప్రపంచ దృష్టిని తనవైపునకు తిప్పుకున్నాడు. అంత చిన్న వయసులోనే ఐపీఎల్‌లో అరంగేట్రం చేయడమే కాకుండా తొలి మ్యాచులోనే సిక్సులు, ఫోర్లు బాదుతూ భవిష్యత్తులో తాను టీమిండియాలో కీలకంగా మారతాన్న సందేశాన్ని ఇచ్చాడు.
అయితే, ఇంత చిన్న వయసులో అంతటి కఠోర ప్రాక్టీసు చేయడం, ఐపీఎల్‌లోకి రావడం సరైనదేనా? అన్న సందేహాలు కూడా చాలా మందికి వస్తున్నాయి. భారత్‌లో 14 ఏళ్లలోపు పిల్లలతో ఫ్యాక్టరీల్లో, పరిశ్రమల్లో ఇతర ఏ ప్రదేశంలోనైనా పనులు చేయించుకుంటే బాల కార్మిక చట్టం కింద నేరం.
పిల్లలను పనిలో పెట్టుకోకూడదన్న రూల్స్ ఉన్నాయి కానీ, క్రీడల్లో మాత్రం ఇటువంటి నిబంధనలు ఏమీ లేవు. ఇప్పటికే క్రీడలకు సంబంధించిన ఎన్నో పోటీల్లో 14 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు ఆడుతున్నారు. గతంలోనూ చాలా మంది ఈ వయసులో క్రికెట్ ఆడారు. అయితే, ఐసీసీ మ్యాచ్‌లలో పాల్గొనడానికి మాత్రం వైభవ్‌కు 15 ఏళ్లు ఉండాల్సిందే. ఐసీసీ ఈ రూల్‌ని పాటిస్తోంది.
కాగా, ఐపీఎల్ 2008లో ప్రారంభమైంది. ఆ తర్వాత మూడేళ్లకు వైభవ్ సూర్యవంశీ జన్మించాడు. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత జన్మించిన మొదటి ఐపీఎల్ ఆటగాడు ఇతడే. అతడు గత ఐపీఎల్ మెగా వేలంలో 1.1 కోట్లు పలికాడు. అతడి కెరీర్ కోసం అతడి కుటుంబం భూమిని కూడా అమ్మేసింది. ఇప్పుడు వైభవ్ కోట్లు సంపాదిస్తున్నాడు.