captain Jasprit Bumrah key comments after win first test against australia
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ శుభారంభం చేసింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఆసీస్ తొలిఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు కీలకమైన 46 పరుగుల ఆధిక్యం లభించింది.
ఆ తరువాత యశస్వి జైస్వాల్ (161), విరాట్ కోహ్లీ(100 నాటౌట్) శతకాలతో చెలరేగడంతో రెండో ఇన్నింగ్స్ లో భారత్ 487/6 స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆసీస్ ముందు 534 పరుగుల లక్ష్యం నిలవగా ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 238 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ ఘన విజయం సాధించింది. మ్యాచ్ గెలిచిన అనంతరం భారత జట్టు కెప్టెన్ బుమ్రా మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశాడు.
WTC : డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానంకు భారత్ జట్టు.. రెండో ప్లేస్‌లో ఆస్ట్రేలియా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శుభారంభం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నిజం చెప్పాలంటే మొదటి ఇన్నింగ్స్‌లో ఒత్తిడికి గురి అయ్యాం. అయితే.. ఆ తర్వాత ఆడిన తీరు పట్ల చాలా గర్వంగా ఉంది. 2018లోనూ ఇక్కడ ఆడాను. మేము ఈ సిరీస్ కోసం చాలా బాగా సన్నద్ధం అయ్యాము. టీమ్‌లోని ప్రతి ఒక్కరికి వారి వారి పాత్ర, సామర్థ్యం పై స్పష్టమైన అవగాహన ఉంది. అనుభవం అనేది ముఖ్యం కాదు.. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడడం ముఖ్యం. ముఖ్యంగా ఏమైనా సాధించగలం అనే నమ్మకం ఉంటే చాలు అని బుమ్రా అన్నాడు.
తొలి ఇన్నింగ్స్‌లో విఫలం అయినా రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకంతో చెలరేగిన యశస్వి జైస్వాల్ పై బుమ్రా ప్రశంసల వర్షం కురిపించాడు. జైస్వాల్ తన టెస్టు కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడని చెప్పాడు. ఇప్పటి వరకు ఆడిన అతడి ఇన్నింగ్స్‌ల్లో ఇదే అత్యుత్తమ టెస్టు ఇన్నింగ్స్ అని తెలిపాడు. సహజంగా బంతిని బలంగా బాదేందుకు జైస్వాల్ ఇష్టపడుతాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో పరిస్థితులకు తగ్గట్లుగా ఎక్కువ బంతులను వదిలి వేశాడు. చాలా సేపు క్రీజులో ఉండేందుకు ప్రయత్నించాడని మెచ్చుకున్నాడు.
కేఎల్ రాహుల్ సైతం ఓపెనర్‌గా అద్భుతంగా రాణించాడని చెప్పాడు. విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. అతడో అత్యుత్తమ ప్లేయర్ అని అన్నాడు. ఇలాంటి ఛాలెంజింగ్ వికెట్ పై బ్యాట్‌మెన్ ఫామ్‌లో ఉన్నాడో లేడో చెప్పడం కష్టమన్నాడు. విరాట్ అనుభవం వెలకట్టలేనిది అని బుమ్రా అన్నాడు.