Irfan Pathan
Irfan Pathan: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఈనెల 23న (ఆదివారం) చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-ఏలో రెండు మ్యాచ్ లు జరిగాయి. పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ ఓడిపోయింది. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది. అయితే, తొలి మ్యాచ్ లో ఓడిపోయిన పాకిస్థాన్ జట్టు భారత్ తో జరిగే మ్యాచ్ లో విజయం సాధిస్తేనే సెమీస్ కు వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీంతో ఇండియాతో డూఆర్ డై మ్యాచ్ కోసం పాకిస్థాన్ రెడీ అవుతోంది.
బంగ్లాదేశ్ జట్టుపై ఏకపక్ష విజయంతో భారత్ ఆటగాళ్లు జోరుమీద ఉన్నారు. బంగ్లాదేశ్ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో టీమిండియా అద్భుతంగా రాణించింది. అయితే, ఫీల్డింగ్ విషయంలో మెరుగైన ప్రదర్శన ఇవ్వడంలో విఫలమైంది. పలుసార్లు బ్యాటర్లను అవుట్ చేసే అవకాశం వచ్చినా నేరుగా వికెట్లకు బాల్ విసిరి అవుట్ చేయడంలో భారత్ ఫీల్డర్లు విఫలం అయ్యారు. పలుసార్లు క్యాచ్ లు సైతం మిస్ చేశారు. అయితే, ఆదివారం పాకిస్థాన్ జట్టుతో జరిగే మ్యాచ్ లో ఫీల్డింగ్ లోనూ రాణిస్తే పాకిస్థాన్ జట్టు ఓడిపోవటం ఖాయమని మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు.
Also Read: IND vs PAK : పాకిస్తాన్‌తో మ్యాచ్.. వరల్డ్ రికార్డు పై కోహ్లీ కన్ను..
పాకిస్థాన్ వర్సెస్ భారత్ తలపడే మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందన్న చర్చ జోరుగా సాగుతుంది. ఈ అంశంపై భారీ ఎత్తున బెట్టింగ్ లు కొనసాగుతున్నాయి. అయితే, ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘పాకిస్థాన్ జట్టులో చాలా సమస్యలు ఉన్నాయి. కొంతమంది సీనియర్ ఆటగాళ్ల విషయానికొస్తే వారు ప్రస్తుత క్రికెట్ లో అంత దూకుడుగా ఆడలేక పోతున్నారు. ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్ లో వారు రాణించలేక పోతున్నారు. వారి ఆటతీరును న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో గమనించాం.. భారత్ తో పోరులోనైనా మారతారా? అంటే చెప్పడం కష్టమే. అయితే, ఇక్కడ ఓ విషయం ఉంది. భారత్ – పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఇరు జట్ల ఆటగాళ్లలో ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. ఎవరు దీనిని సరిగ్గా హ్యాండిల్ చేస్తారో ఆ జట్టే గెలుస్తుంది’’ అని పఠాన్ వెల్లడించాడు.
బంగ్లాదేశ్ మ్యాచ్ లో మహ్మద్ షమీ ఐదు వికెట్లు పడగొట్టడం భారత్ జట్టుకు మంచిపరిణామం. గాయం నుంచి కోలుకొని వచ్చాక ఇలాంటి ప్రదర్శన తప్పకుండా అతడికి మరింత ఆత్మవిశ్వాసం పెంచుతుంది. భారత్ జట్టులో అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. రోహిత్, విరాట్ నిలకడగా పరుగులు రాబడితే టీమిండియాను ఆపడం ఎవరితరమూ కాదు అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.