Cheteshwar Pujara has answers for Kohlis No 4 successor
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు మిడిల్ ఆర్డర్‌లో ఎంతో కీలకమైన నాలుగో స్థానంలో ఆడుతూ జట్టు బాధ్యతలను తన భుజాల పై మోశాడు కోహ్లీ. అయితే.. ఇప్పుడు అతడు సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో.. నాలుగో స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరు? అన్న చర్చ మొదలైంది.
దీనిపై టీమ్ఇండియా వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజరా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరు అనేది ఇప్పుడే చెప్పలేమన్నాడు. కనీసం రెండు సిరీస్‌ల తరువాతే దీనిపై ఓ అంచనాకు రాగలమని తెలిపాడు.
‘నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి ఎవరు సరిపోతారు అనే విషయం తెలుసుకునేందుకు కనీసం రెండు సిరీస్‌లు అవసరం. ఎందుకంటే ఇది ముఖ్యమైన స్థానం. ఇక్కడే ఆడే బ్యాటర్ అత్యుత్తమ ఆటగాడై ఉండాలి. అప్పుడే జట్టు నిలబడుతుంది. ప్రస్తుతం జట్టులో చోటు దక్కించుకునేందుకు చాలా మంది పోటీపడుతున్నారు. వీరిలో ఎవరు నాలుగో స్థానంలో సరిపోతారో అనేది ఇంగ్లాండ్ పర్యటన తరువాతే తేలుతుంది.’ అని పుజారా అన్నాడు.
ఇంగ్లాండ్ గడ్డ పైన రాణించే ఆటగాడు ఇంకా ఎక్కడైనా రాణిస్తాడని పుజారా చెప్పాడు.
దిగ్గజ ఆటగాడు సచిన్ ఆటగాడు ఆటకు వీడ్కోలు చెప్పాక 99 సార్లు కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఇక రహానే 9 సార్లు, పుజారా ఏడు టెస్టుల్లో నాలుగో స్థానంలో బరిలోకి దిగారు. ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ వంటి వారికి కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఉందని పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జూన్ 20 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది.