చైనా ఓపెన్ లో ఛాంపియన్ కు చుక్కెదురు: టోర్నీ నుంచి సింధు అవుట్

ప్రపంచ విజేతగా నిలిచిన పీవీ సింధుకు చైనా ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో మాత్రం నిరాశ ఎదురైంది. వరల్డ్ ఛాంపియన్ షిప్ ముగిసిన కొద్ది రోజుల్లోనే మొదలైన చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నమెంట్‌కు మహిళల ప్రపంచ చాంపియన్ పీవీ సింధు ఈ టోర్నీ నుంచి ఫస్ట్ లోనే చుక్కెదురైంది.
2016లో ఇదే టోర్నీలో విజేతగా నిలిచిన సింధు.. మహిళల సింగిల్స్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్‌లో సింధు 21-12, 13-21, 19-21 తేడాతో థాయిలాండ్ క్రిడాకారిణి పోర్న్‌పావే చూచూవోంగ్ చేతిలో ఓడిపోయింది. తొలి గేమ్‌ను సునాయాసంగా గెలిచిన సింధు.. ఆపై వరుస రెండు గేమ్‌ల్లో విఫలమైంది. రెండో గేమ్‌లో పుంజుకున్న చూచూవోంగ్ వరుస గేమ్ లలో సింధుపై ఆధిపత్యం ప్రదర్శించింది.
అంతకుముందు జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఐదవ సీడ్ సింధు 21–18, 21–12తో ప్రపంచ మాజీ నంబర్‌వన్, 2012 లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లీ జురుయ్ (చైనా)పై అలవోకగా గెలిచింది. దీంతో రెండవ రౌండ్ కు చేరుకుంది.
50 నిమిషాలకు పైగా సాగిన రెండవ రౌండ్ ఆరంభంలో సింధు ఆకట్టుకోగా తర్వాత మాత్రం అంచనాలను అందుకోలేదు. రెండో గేమ్‌ను భారీ తేడాతో కోల్పోయిన సింధు.. మూడో గేమ్‌లో మాత్రం కడవరకూ పోరాడింది. కానీ చివరకు టోర్నీ నుంచి వైదొలగక తప్పలేదు. సైనా నెహ్వాల్ కూడా టోర్నీ నుంచి ఇప్పటికే బయటకు వచ్చేసింది.