ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తుంది. ఈ క్రమంలో ప్రజలు వణికిపోతున్నారు. కరోనాపై హైరానా అయిపోతున్నారు. ప్రపంచ దేశాలకు కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు మన ఇండియాను పట్టుకుంది. ఇప్పటికే వేల సంఖ్యలో అనుమానితులు.. వందల సంఖ్యలో ఖరారైన కేసులు.. 8 మరణాలు ఆందోళనకు జన జీవనాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా క్రీడలపై ఈ కరోనా ప్రభావం పడుతుంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా చాలా సిరీస్‌లు అలాగే మెగా టోర్నీలు రద్దయిపోయాయి.
లేటెస్ట్‌గా ‘కరోనా నడుస్తున్న సమయంలో ఐపీఎల్ అప్రధానమైన అంశం’ అంటూ ఓ ఫ్రాంచైజీ అధికారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఐపీఎల్ రద్దు వార్తలకు బలం చేకూర్చుతున్నాయి. రాష్ట్ర సరిహద్దులు మూసివేసి అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని ఆపేయగా., దేశవాళీ సర్వీసులు కూడా నిలిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే భారత్‌లోని నగరాలన్నీ లాక్‌డౌన్ చెయ్యడంతో ఈ ఏడాది ఐపీఎల్ రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించేందుకు సిద్ధం అవుతుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).
ఐపీఎల్ పాలకమండలి చైర్మన్ బ్రిజేశ్ పటేల్ మాట్లాడుతూ.. ఐపీఎల్‌పై చర్చించడానికి ఏ మీటింగ్ లేదని కరాకండీగా చెప్పేశారు. గతంలో ఏప్రిల్ 15 వరకు లీగ్‌ను వాయిదా వేసినప్పటికంటే ఇప్పుడు పరిస్థితులు మరింత దిగజారాయి. పక్కరాష్ట్రం వ్యక్తులు, వాహనాల్నే తమ రాష్ట్రాల్లోకి రానీయడం లేదు. విదేశీయులు వచ్చే విమానాలను రానిస్తారా? ఇంకా చెప్పాలంటే పగలు పప్పు, ఉప్పు కోసం, రాత్రయితే మందుల (మెడిసిన్) కోసమే రోడ్లపైకి జనాలు వస్తున్నారు. అని అన్నారు.
ఇటువంటి పరిస్థితిలో ఐపీఎల్ ఆటల్ని సాగనిచ్చే పరిస్థితే లేదు. కాబట్టి రద్దు తప్ప వాయిదాకు అవకాశం లేదు. బీసీసీఐ వర్గాలు ఇదే విషయాన్ని చెబుతున్నప్పటికీ అధికారికంగా మాత్రం వెల్లడించేందుకు ఇంకాస్త సమయం పట్టవచ్చు. ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా భావించే క్రీడా పోటీలే ఇప్పటికే చాలావరకు రద్దు అయ్యాయి. అయితే ఐపీఎల్ రద్దు అయితే ఐపీఎల్ లీగ్‌లు స్టార్ట్ అయ్యాక ఫస్ట్ టైమ్ రద్దు అయిన పరిస్థితి ఈ ఏడాదే కనిపిస్తుంది.
See Also | ఢిల్లీలో షాకింగ్ ఘటన : కరోనా అంటూ యువతిపై ఉమ్మేశాడు